అంతర్జాతీయం: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం
ఇరాన్ క్షిపణి దాడి అనంతరం, ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయం మధ్యప్రాచ్యాన్ని కమ్మేస్తోంది. ఈ పరిణామాలు గమనించిన అభివృద్ధి చెందిన దేశాల సమూహం జీ-7 అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా పలు కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరాన్ దాడి నేపధ్యంలో ఇజ్రాయెల్‌కు పూర్తి మద్దతు ఇవ్వాలని నిర్ణయించడమే కాకుండా, ఇరాన్‌పై కఠిన ఆంక్షలు విధించేందుకు జీ-7 దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.
ఇజ్రాయెల్‌కు బేషరతు మద్దతు ప్రకటన
వైట్ హౌస్ ప్రకటనలో ఇలా చెప్పింది, “బైడెన్, జీ7 ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడిని నిస్సందేహంగా ఖండించాయి. అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయెల్, ఆ దేశ ప్రజలకు యునైటెడ్ స్టేట్స్ యొక్క పూర్తి సంఘీభావం, మద్దతును వ్యక్తం చేశారు. అమెరికా బలమైన నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఒక రోజు ముందు, బైడెన్ ఇజ్రాయెల్ వైపు వెళ్లే క్షిపణులను కూల్చివేయాలని యుఎస్ ఆర్మీకి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం, ఇజ్రాయెల్‌ను రక్షించడానికి మధ్యప్రాచ్యంలో సుమారు 1 లక్ష మంది అమెరికన్ సైనికులు, రెండు క్యారియర్ స్ట్రైక్ గ్రూపులు,వందలాది ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు మోహరించబడ్డాయి.” వైట్ హౌస్ ప్రకటించింది.
ఇరాన్ అణు కేంద్రంపై దాడికి అనుమతి లేదు
జీ-7 సమావేశం అనంతరం, ఇరాన్‌పై ప్రతీకార దాడి చేసే ముందు ఇజ్రాయెల్‌తో చర్చలు జరుపుతున్నామని, కానీ ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేయడం సరైన మార్గం కాదని బైడెన్ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌కు స్వీయ రక్షణ హక్కు ఉన్నప్పటికీ, ప్రతీకారం తీర్చుకోవడంలో దామాషా పాటించాలని సూచించారు.
ఇజ్రాయెల్ హిజ్బొల్లా స్థావరాలపై దాడులు
అయితే తాజాగా హిజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌లో మరోసారి దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. గురువారం ఉదయం రాజధాని బీరుట్ నడిబొడ్డున రాకెట్లతో ఇజ్రాయెల్ సేనలు దాడి జరిపాయి. సెంట్రల్ బీరుట్‌లోని పార్లమెంట్ భవనానికి సమీపంలో ఉన్న ఓ భవనాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిపినట్టు తెలుస్తోంది. బచౌరా ప్రాంతంలో జరిగిన ఈ దాడి లెబనాన్ ప్రభుత్వాన్ని నిర్వహించే ప్రదేశానికి దగ్గరలోనే జరగడంతో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడుల్లో ఆరుగురు చనిపోయినట్టు తెలుస్తోంది. కాగా బీరుట్ నగరంలో ఇజ్రాయెల్ దాడులు జరపడం 2006 తర్వాత ఇదే తొలిసారి అని తెలుస్తోంది. ఈ దాడులకు ముందు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, కేంద్ర బీరుట్‌లో జరిగిన దాడి విషయంలో మాత్రం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు.
అమెరికా కొత్త ఆంక్షలు
ఇరాన్ దాడిని చూసి స్పందించిన అమెరికా కూడా ఇరాన్‌పై కొత్త ఆంక్షలు విధిస్తోందని ప్రకటించింది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ మాట్లాడుతూ, ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్ చర్యలకు కఠిన ప్రతిస్పందన ఇస్తామని, ఇది ఇరాన్‌కు తీవ్రమైన పరిణామాలను తీసుకురాగలదని హెచ్చరించారు.
గుటెరస్‌పై ఇజ్రాయెల్ నిషేధం
ఇరాన్ దాడిని ఖండించని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఇజ్రాయెల్, ఆయనపై తమ దేశంలో అడుగుపెట్టే హక్కు లేదని ప్రకటించింది. గుటెరస్‌ను ‘పర్సనా నాన్ గ్రాటా’గా ప్రకటించి, ఆయనను ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించకుండా నిషేధించింది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, గుటెరస్‌ను ఉగ్రవాదులకు అండగా నిలిచిన వ్యక్తిగా విమర్శించారు.
నెతన్యాహు హెచ్చరిక
ఇరాన్ దాడులపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఈ ఘటనకు ఇరాన్ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ‘‘ఇరాన్ ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తోంది. ఇది యుద్ధంలో కీలకమైన మలుపు’’ అంటూ అన్నారు. అలాగే, ప్రపంచం మొత్తం ఇరాన్ కంటే ఇజ్రాయెల్ పక్షాన నిలవాలని పిలుపునిచ్చారు.