టాలీవుడ్: మహా శివరాత్రి సందర్భంగా తెలుగులో చాలా సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొంచెం పేరున్న టెక్నిషియన్స్, యాక్టర్స్ రూపొందించిన సినిమాల్లో జాతి రత్నాలు, శ్రీకారం, గాలి సంపత్ ముందు వరుసలో నిలిచాయి. జాతి రత్నాలు బ్లాక్ బస్టర్ టాక్ తో రికార్డ్స్ క్రియేట్ చేసే దిశగా వెళ్తుండగా, శ్రీకారం హిట్ టాక్ తో స్లో రన్ ఐతుండగా అనూహ్యంగా గాలి సంపత్ సినిమా మాత్రం వారం రోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షం అవబోతుంది. మార్చ్ 11 న విడుదలైన సినిమా మార్చ్ 19 న ఓటీటీల్లో విడుదల అవబోతుంది. సినిమా మంచి ఎంటర్టైనర్ అని , అనిల్ రావిపూడి సమర్పణ అని ప్రచారం లో హోరు చూపించిన ప్రొడ్యూసర్స్ ఒక వారంలోనే ప్లేట్ తిప్పేశారు.
ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్, సినిమాని థియేటర్లలో చూసిన ప్రేక్షకులకి ఈ సినిమా మేకర్స్ ఏం చెప్పదలచుకున్నారు? అంటే రాబోయే రోజుల్లో కొత్తగా విడుదలయ్యే సినిమాలు జనాలు చూడకపోతే వారం రోజుల్లోనే ఓటీటీ లో వేసేస్తాం, థియేటర్లకు రాకుండా వారం రోజులు ఎదురుచూడండి సినిమాలే మీ ఇంటికి వస్తాయి అని సందేశం ఇస్తున్నారా. ఇప్పటికే లాక్ డౌన్ వల్ల, కరోనా వల్ల ఓటీటీ కి ఆదరణ పెరగడం తో థియేటర్లకి జనాలు ఎంత కాదన్న కొద్దిగా తగ్గారు అనేది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం. దానితో పాటు కొన్ని సినిమాలు ఇలాంటి ఫీట్స్ చేయడం వలన సగటు ప్రేక్షకుడు సినిమాలని థియేటర్లలో చూడడానికి ఇంకొకసారి ఆలోచించే పరిస్థితి వస్తుంది.
మంచి సినిమాలు తీసి కరెక్ట్ గా ప్రచారం చేస్తే జాతి రత్నాలు లా హిట్ గా నిలుస్తాయి, మంచి కంటెంట్ ని నమ్ముకొని తీస్తే ప్రచారం కొద్దిగా తగ్గినా కానీ శ్రీకారం సినిమా లాగా మౌత్ టాక్ తో మరి కొన్ని రోజులు థియేటర్లలో నిలబడుతుంది. మరి గాలి సంపత్ సినిమా ఫెయిల్యూర్ సినిమా ప్లానింగ్ లో పోయిందా, ఎలా చేసినా ప్రేక్షకులు చూసేస్తారులే అని తీసారా అనేది మరో సారి నిర్మాతలు, డైరెక్టర్స్ తమని తాము ప్రశ్నించుకోవాల్సింది. ఒక వారం లో విడుదలైన ఈ మూడు సినిమాలే ఎలాంటి సినిమాలు నిలబడతాయి, ఎలాంటి సినిమాలు పడిపోతాయి అనడానికి నిదర్శనం.