ఏపీ: మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న వైసీపీలో కొత్త చేరికలు ఊపందుకుంటున్నాయి. ఇటీవల పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ వైసీపీలో చేరగా, ఇప్పుడు మరో కీలక నేత ఆ పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
తెలుగు రాజకీయాల్లో పేరుపొందిన కుటుంబానికి చెందిన గాలి జగదీశ్ ప్రకాష్ త్వరలో వైసీపీలో చేరనున్నారని తెలుస్తోంది.
గాలి జగదీశ్ ప్రకాష్, టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ సోదరుడు కాగా, వారి కుటుంబానికి చిత్తూరు జిల్లాలో గట్టి పట్టు ఉంది. ముద్దు కృష్ణమ నాయుడు రాజకీయ వారసత్వాన్ని భాను ప్రకాష్ కొనసాగిస్తుండగా, జగదీశ్ కు కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్ష ఉంది.
గతంలో వైసీపీలో చేరేందుకు ప్రయత్నించినా, రోజా ప్రభావం కారణంగా ఆ అవకాశం దక్కలేదు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, రోజాకు చెక్ పెట్టే వ్యూహంలో భాగంగా జగదీశ్ వైసీపీ ఎంట్రీని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. జగన్ కూడా ఇందుకు అనుకూలంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ పరిణామాలతో నగరి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జగదీశ్ ప్రకాష్ ఎంట్రీతో రోజాకు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది. ఇక జగన్ అధికారికంగా ఎప్పుడు ఆయన చేరికను ప్రకటిస్తారో వేచి చూడాలి.