న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్‌ను భారత అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా భావిస్తున్నట్లు భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు.
పంత్ తిరిగి జట్టులో స్థానం సంపాదించడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని, టెస్ట్ ఫార్మాట్‌లో అతను భారత్‌కు కీలక ఆటగాడిగా కొనసాగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
టెస్ట్ క్రికెట్‌లో పంత్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని గంగూలీ ఆకాంక్షించాడు. అలాగే, టెస్ట్ క్రికెట్‌లో తన సత్తా చాటుతున్న పంత్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కూడా తన ఆటతీరును మెరుగుపర్చాలని సలహా ఇచ్చాడు.
పంత్ తన ప్రతిభను కొనసాగిస్తే అత్యుత్తమ క్రికెటర్‌గా ఎదగడం అనివార్యమని విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘‘టెస్ట్ క్రికెట్‌లో పంత్ ఈ స్థాయిలో రాణిస్తే, అతను ఒక ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్‌గా నిలుస్తాడు.
కానీ పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కూడా అతని ఆటను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది’’ అని గంగూలీ పేర్కొన్నాడు. కోల్‌కతాలో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.
అదే సమయంలో, చీలమండ గాయం నుంచి కోలుకుంటున్న మహ్మద్ షమీ గురించి మాట్లాడుతూ, బంగ్లాదేశ్ సిరీస్‌కు అందుబాటులో ఉండకపోవడం పట్ల ఆందోళన అవసరం లేదని, చెన్నై పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండడంతో భారత్ స్పిన్నర్లు అద్భుతంగా రాణిస్తారని విశ్లేషించాడు.
‘‘అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వంటి ప్రపంచ స్థాయి స్పిన్నర్లు భారత జట్టులో ఉన్నారు. వారు ఇండియాలో ఆడుతున్నారు కాబట్టి చక్కగా ప్రదర్శిస్తారు’’ అని గంగూలీ విశ్వాసం వ్యక్తం చేశాడు.
గాయం కారణంగా షమీ తాత్కాలికంగా జట్టుకు దూరమయ్యాడని, అయితే ఆస్ట్రేలియా పర్యటనకు సమయానికి జట్టులో తిరిగి చేరుతాడని తెలిపాడు.
సెప్టెంబర్ 19న బంగ్లాదేశ్‌తో ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌లో రిషబ్ పంత్ ఆడనున్నాడు. రోడ్డు ప్రమాదం తర్వాత టెస్ట్ క్రికెట్‌లో అతనికిది పునరాగమనం కానుంది.
2022 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌పై జరిగిన టెస్ట్ సిరీస్‌లో పంత్ ఆడినప్పటి నుండి అతడు టెస్ట్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.