శంషాబాద్: తెలంగాణ రాజధాని పరిధిలోని హైదరాబాద్ యొక్క శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న డ్రైనేజీ పైపులకు మరమ్మతు చేస్తుండగా ఘాటైన గ్యాస్ లీకై ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి మరణించాడు. ఈ ఘటనలో ఇంకో ఇద్దరు కూడా అస్వస్థతకు గురవడంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
స్థానిక పోలీసులు ఇచ్చిన వివరాలా ప్రకారం, నిన్న అనగా గురువారం రాత్రి 7 గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఔట్‌పోస్ట్ సమీపంలో ఉన్న ఒక భవనంలోని డ్రైనేజీ పైపులో లీకేజీ అవడంతో ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన ఒక ప్లంబర్లు నాగన్నగారి నరసింహారెడ్డి(42), జకీర్, ఇలియాస్ అక్కడకు మరమ్మతు చేయడం కోసం వచ్చారు.
కాగా లీకేజీ అవుతున్న భవనం పై అంతస్తు నుంచి వస్తున్న పైపులో నుంచి కావడంతో నిచ్చెన సాయంతో ఎక్కి ఫాల్స్ సీలింగ్ కొంతభాగం తొలగించి పైపులో యాసిడ్ పోశారు. అందువల్ల డ్రైనేజీ పైపు నుంచి ఘాటైన గ్యాస్ లీక్ కావడంతో నరసింహారెడ్డికి ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందగా జకీర్, ఇలియాస్‌లు మాత్రం అక్కడే పడిపోయారు. అధికారులు ఉన్నఫలంగా వారిద్దరినీ ఎయిర్‌పోర్టులో సమీపంలో ఉన్న అపోలో ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.