హైదరాబాద్‌లో చిట్టీల పేరుతో రూ.100 కోట్ల ఘరానా మోసం
ఉపాధి కోసం వచ్చిన వ్యక్తి..
అనంతపురం జిల్లా యాడికి మండలం చందన లక్ష్మీంపల్లికి చెందిన పుల్లయ్య, భూలక్ష్మి దంపతులు 18 ఏళ్ల కిందట ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చారు. తొలి రోజుల్లో పుల్లయ్య అడ్డాకూలీగా పనిచేశాడు. స్థానికంగా పరిచయాలు పెంచుకుంటూ, చిట్టీల వ్యాపారం ప్రారంభించాడు.
15 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం.. కోట్లకు పడగలెత్తిన వైనం!
ప్రారంభంలో తక్కువ మొత్తంతో చిట్టీలు నడిపిన పుల్లయ్య, క్రమేపీ రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు చిట్టీలను నిర్వహించసాగాడు. కాలక్రమేణా అతని వ్యాపారం విస్తరించడంతో, నగరానికి కొత్తగా వచ్చిన ఈ కూలీ, కోటీశ్వరుడిగా మారాడు. విలాసవంతమైన ఇంటిని నిర్మించుకుని, దందా సాగించాడు.
అధిక వడ్డీ ఆశ చూపి మోసం
చిట్టీల ద్వారా డబ్బులు పోగుచేసుకున్న పుల్లయ్య, 2వేల మందికి పైగా బాధితుల నుంచి భారీగా డబ్బులు సేకరించాడు. ఆయన వద్ద చిట్టీలు వేసుకున్నవారికి సకాలంలో చెల్లింపులు చేయకుండా, పాతదానిని తీరుస్తానని కొత్త చిట్టీ వేయించేవాడు. ఇదే విధానాన్ని అనుసరించి, కొంతమంది వద్ద అధిక వడ్డీకి అప్పు కూడా చేశాడు.
చివరికి రూ.100 కోట్లతో పరార్!
నెలల తరబడి తన వద్ద డబ్బులు ఉన్నవారికి చెల్లింపులు చేయకుండా, చివరకు ఫిబ్రవరి 23 నుండి 26 మధ్య డబ్బులు ఇస్తానని నమ్మించాడు. కానీ ఫిబ్రవరి 21న తన కుటుంబంతో సహా మాయం అయ్యాడు. ఈ విషయం తెలిసి 700 మందికి పైగా బాధితులు అతని ఇంటి వద్దకు చేరుకుని ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు.
బాధితుల కన్నీటి గాధ
చిట్టీల ద్వారా తాము దారుణంగా మోసపని గ్రహించిన బాధితులు వాపోతున్నారు. “సొమ్మంతా పోయింది.. ఇప్పుడేం చేయాలి?” అంటూ వారు రోధిస్తున్నారు. మొత్తం లెక్కల ప్రకారం, రూ.100 కోట్లకు పైగా డబ్బు తీసుకుని పుల్లయ్య పరారైనట్లు సమాచారం.
పోలీసులు కేసు నమోదు.. దర్యాప్తు కొనసాగుతోంది
మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, అనంతపురం జిల్లాల్లో పుల్లయ్యపై కేసులు నమోదు అయ్యాయి. తొలుత అతని ఆస్తులు, బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసేవిధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.