హైదరాబాద్: హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ కొత్త మేయర్ ను ఎన్నుకునేందుకు ముహూర్తం నిర్ణయించబడింది. ఫిబ్రవరి 11న నూతన మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోనున్నారు. దీనికి సంబంధించి శుక్రవారం జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అయితే ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహించనున్నారు. కాగా ఈ ఎన్నిక పర్యవేక్షణకు సంబంధించి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించనున్నారు.
జీహెచ్‌ఎంసీ ప్రస్తుత పాలకమండలి యొక్క పదవీకాలం ఈనెల 10వ తేదీతోనే ముగిసి పోయింది. కొత్తగా ఎన్నికైన 150 మంది కార్పొరేటర్ల పేర్లను నమోదును ఈసీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్‌లో జరిగిన గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. అధికార టీఆర్‌ఎస్ 55 సీట్లకే పరిమితమైంది. 2016 ఎన్నికల్లో 99 చోట్ల నెగ్గి ఏకపక్షంగా గ్రేటర్ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకున్న గులాబీ పార్టీకి ఈసారి ఏకంగా 44 స్థానాలు తగ్గాయి.
అలగే దుబ్బాక విజయంతో గ్రేటర్‌లో దూకుడు ప్రదర్శించిన బీజేపీ అంచనాలకు మించి 48 డివిజన్లలో విజయం సాధించింది. కాగా మజ్లిస్ మరోసారి తన బలాన్ని చాటుతూ 44 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది.