అమరావతి: ఎప్పుడూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని పెద్దలు మరియు వైద్యులు చెబుతుంటారు. అది ఈ కరోనా కాలంలో అందరికీ బాగా అవగాహన వచ్చింది. అయితే ఇలాంటి సందర్భంలోనే కాదు అన్ని వేళలా చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులకు బాల్యం నుంచే దీనిపై అవగాహన పెంచితే చాలా వరకు వాళ్ళకు ఎటువంటి రోగాలు రాకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు. ఇవన్ని ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా?, ఈ రోజు గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం సబ్బుతో లేదా హ్యాండ్ శానిటైజర్ తో చేతులు శుభ్రపరుచుకుంటే కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండదు. దీంతో పాటు టైఫాయిడ్, పచ్చకామెర్లు, కళ్ల కలకలు, దగ్గు, జలుబు, న్యూమోనియా, మెదడు వాపు, చర్మవ్యాధులు వంటి వ్యాధులు కూడా సోకుతాయి. పాఠశాలల్లో విద్యార్థులు చేతుల శుభ్రత విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. వారు వినియోగించే సాక్సులు రోజూ ఉతకడం, నీటి సీసాలు కడగడం వంటివి చేయకపోతే ఫంగస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. పిల్లలు నోట్లో వేళ్లు పెట్టుకోకుండా చూడాలి. బయటకు వెళ్ళి ఆటలాడి ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కునేలా చర్యలు తీసుకోవాలి.
ఇంకా రోజూ చేతులు మారే కరెన్సీతో పాటు ప్రతి చోటా చేతులు పెట్టడం ద్వారా మనకు క్రిముల రూపంలో వ్యాధులు సోకే ప్రమాదం లేఖ పోలేదు. ఏవైనా రోగాలున్న వారి నుంచి రోగకారక క్రిములు మన చేతికి వస్తే అవి మన శరీరంలోకి వెళ్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఇలాంటి వాటిని పట్టుకున్నప్పుడు తక్షణమే చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.