ముంబై: దేశంలో పెళ్లిళ్లకు శుభ ముహూర్తాలు దగ్గర పడుతున్న వేళ బంగారం ప్రియులకు శుభవార్త. ఈ మధ్య కాలంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న బంగారం ధరలు తాజాగా మూడు నెలల కనిష్టానికి చేరాయి.
ఈ రోజు మార్కెట్లో బంగారం ఫ్లాట్గా కొనసాగుతున్నప్పటికీ 2016 తరువాత బంగారం ధరలు భారీగా పడిపోయిన నెల ఈ నెలే అని నిపుణులు అంటున్నారు. ఈ నెలలో 10 గ్రాముల బంగారం ధర 7.6 శాతం క్షీణించగా, మొత్తం ఈ త్రైమాసికంలో 3.2 శాతానికి ఎగిసింది. గత ఏడాది రూ. 56200 గరిష్టం నుంచి 10వేల రూపాయలు పడిపోయింది. ఇక ఈ నెలలోనే ఏకంగా 2,700 రూపాయలు దిగి వచ్చింది.
అంతర్జాతీయ మార్కెట్లలో, బంగారు రేటు ఔన్సుకు 1,763.63 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అంటే, దాదాపు నాలుగు సంవత్సరాలలో ఇదే అతిపెద్ద నెలవారీ పతనం. కాగా వెండి స్వల్ప లాభాలను ఆర్జిస్తోంది. వెండి ఔన్స్ 0.3శాతం పెరిగి 25.82 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.3శాతం పెరిగి 1,070.38 డాలర్లకు చేరుకుంది.
అలాగే అమెరికా కార్మిక విభాగం శుక్రవారం విడుదల చేయనున్న ఉద్యోగాల నివేదిక కీలకమని, ఊహించిన దానికంటే ఘోరంగా ఈ గణాంకాలుంటే భవిష్యత్తులో మరింత ఒత్తిడి బంగారం పై తప్పదని బులియన్ వర్గాలు పేర్కొన్నాయి.