న్యూఢిల్లీ: బంగారం ధరలు గత కొద్దిల్ రోజులుగా తీవ్ర ఊగిసలాటకు లోనవుతున్నాయి. ఇప్పుడు వివాహాది శుభకార్యక్రమాల కోసం ఎవరైనా బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటే వారికి ఇదే సరైన సమయంలా అనిపిస్తోంది. రోజు రోజుకీ భారీగా తగ్గుతున్న బంగారం ధరలే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
కాగా లాక్‌డౌన్ సమయంలోనే రూ.50 వేలు పైన పలికిన తులం బంగారం ధర ఇప్పుడు క్రమంగా నేల చూపులు చూస్తోంది. ఇతర దేశాల్లో బంగారంపై పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్న కారణంగా బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో కేవలం ఇవాళ ఒక్కరోజే బంగారం ధర రూ.950 వరకు తగ్గింది.
తగ్గిన ధరల ప్రకారం నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.42,100 ఉంది. ఒక్క గ్రాము బంగారం ధర నేడు రూ.4,210గా ఉంది. అలాగే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.45,930 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.1,040 తగ్గింది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.1300 తగ్గి రూ.72000కు చేరుకుంది. భవిష్యత్ లో ఇంకా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.