న్యూఢిల్లీ: ఇవాళ బంగారం ధరలు మళ్ళీ పడిపోయాయి, కాబట్టి బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. ఇవాళ పసిడి మరియు వెండి ధరలు ఒకేసారి రికార్డు స్థాయిలో తగ్గాయి. బంగారం ధర ఇప్పుడు నేల చూపులు చూస్తోంది. బులియన్ జ్యూవెలరీ మార్కెట్లో ఆగస్టు 6న రూ.47,731 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇవాళ 1,175 రూపాయలు తగ్గి రూ.46,556 తగ్గింది.
ఇక ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.43,722 నుంచి రూ.42,645 పడిపోయింది. ప్రపంచ మార్కెట్లలో కూడా బంగారం రేట్లు నేడు 4.4% వరకు పడిపోయాయి, ఎందుకంటే అమెరికాలో ఉద్యోగాల నియామక ప్రక్రియ ఫెడరల్ రిజర్వ్ ఊహించిన దానికంటే వేగంగా పెరగడం, గోల్డ్ మీద పెట్టిన పెట్టుబడులు వెనక్కి తీసుకోవడంతో బంగారం ధర తగ్గినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
కాగా హైదరాబాద్ మార్కెట్లో కూడా పసిడి ధరలు చాలా మొత్తంలో పడిపోయాయి. స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,830 నుంచి రూ.530 తగ్గి ధర రూ.47,300కు చేరింది. అలాగే ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,840 నుంచి 490 రూపాయలు తగ్గి రూ. 43,350 చేరుకుంది. బంగరం స్థాయిలోనే వెండి ధరలు కూడా పతనమయ్యాయి.
ఇవాళ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.66,990 నుంచి ఒకేసారి రూ.64,025 చేరుకుంది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం అవుతాయి.