న్యూఢిల్లీ: భారత మార్కెట్లో ఈ రోజు బంగారు ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. ఇండియన్ బులియన్, జెవెల్లెర్స్ అసోసియేషన్ ప్రకారం దేశ రాజధాని అయిన న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో ఈ రోజు స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రూ.48,536 నుంచి ఒక్కసారిగా రూ.49,105కు పెరగింది.
గడచిన ఒక్క రోజులో బంగారం ధర రూ.569 పెరగింది అన్నమాట. అలాగే ఇక నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.44,459 నుంచి రూ.44,980కు పెరిగింది. బంగారం బాటలోనే వెండి కూడా జోరు పెంచింది. కిలో వెండిపై రూ.752 పెరగడంతో రూ.71,700కు చేరింది.
దక్షిణాన హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు ఉదయం 10 గ్రాములు రూ.45,600 నుంచి రూ.46,100కు పెరిగింది. అలాగే పెట్టుబడులు పెట్టేందుకు వాడే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు బంగారం ధర రూ.540 పెరిగి రూ.50,300కు పెరిగింది. కాగా హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. ఇక అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ బాగా ఏర్పడింది. ఔన్సు 1,908 డాలర్లు ఉండగా, వెండి ఔన్సు 28.07 డాలర్లుకు చేరుకుంది.