ముంబై : దేశంలో బంగారం ధరలు మంగళవారం కూడా తగ్గి వరుసగా ఐదో రోజూ తగ్గినట్లు అయ్యింది. గత కొద్దిరోజులుగా తగ్గుతున్న ధరలతో పసిడి ఈ నెల గరిష్టస్ధాయి నుంచి 5000 రూపాయలు దిగివచ్చింది. కోవిడ్-19 వ్యాక్సిన్‌పై ఆశలు, అమెరికా-చైనా వాణిజ్య బంధంపై సానుకూల సంకేతాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధరలు పడిపోయాయి.
ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 228 రూపాయలు తగ్గి 51,041 రూపాయలు పలికింది. ఇక కిలో వెండి రూ 769 తగ్గి 64,800 రూపాయలకు దిగివచ్చింది. మరోవైపు డాలర్ పుంజుకోవడం, కరోనా వైరస్ చికిత్సపై చిగురిస్తున్న ఆశలతో బంగారం ధరలు ఒడిదుడుకులతో సాగుతున్నాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన నవనీత్ దమాని పేర్కొన్నారు.
ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పావెల్ గురువారం జాక్సన్ హోల్‌లో చేసే ప్రసంగం పట్ల బులియన్ ట్రేడర్లు దృష్టి సారించారు. అమెరికా ఆర్థిక వ్యవస్ధ పురోగతి బంగారం ధరల తదుపరి దిశను నిర్ధేశిస్తుందని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.