న్యూఢిల్లీ : బంగారం, వెండి ధరలు సామాన్యుడికి అందకుండా ఆకాశానికి ఎగసిపడుతున్నాయి. గత రెండు వారాలుగా పైపైకి ఎగబాకిన పసిడి దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఆల్‌టైం రికార్డు ధరలకు చేరాయి. పదిగ్రాముల పసిడి ఏకంగా రూ 57,008 పెరిగింది. మరోవైపు వెండి ధర కిలోకు 576 రూపాయలు పైగి రూ 77,840 పలికింది.
పసిడి ధరలు స్వల్పంగా పెరిగినా గత 16 సెషన్స్‌లో వరుసగా పెరగడంతో తాజాగా సరికొత్త శిఖరాలకు ఎగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం త్వరలోనే రికార్డుస్ధాయిలో 2080 డాలర్ల వరకూ పెరుగనుందని నేషనల్ ఆస్ర్టేలియా బ్యాంక్ ఆర్థిక వేత్త జాన్ శర్మ అంచనా వేశారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగుతుండడం, ఆర్థిక అనిశ్చితితో మదుపుదారులు బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపడంతో బులియన్ మార్కెట్‌లో ఈవారం బంగారం దాదాపుగా పదేళ్ల గరిష్టస్ధాయిలో భారీగా లాభపడిందని రాయ్‌టర్స్ పేర్కొంది.
కరోనా మహమ్మారితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో బంగారంలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నరని, రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరల మరింతగా పెరుగుదల కొనసాగుతుందని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.