ముంబై: ప్రపంచ మార్కెట్ల సంకేతాలు మరియు యూఎస్ బాండ్ ఈల్డ్స్ పుంజుకున్న నేపథ్యంలో మంగళవారం భారత దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అలాగే మరో ముఖ్యమైన మెటల్ వెండి ధర కూడా ఇవాళ భారీగా తగ్గింది. ఈ వారం చివర్లో అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో వ్యాపారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని బులియన్ వర్గాలు తెలిపాయి.
కాగా ఎంసీఎక్స్‌లో బంగారం 10 గ్రాముల ధర రూ. 50,862గా ఉంది మరియు వెండి కిలో ధర 61,830కి చేరింది. హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్స్ పసిడి ధర 270 రూపాయలు తగ్గి 51,930కు చేరగా, వెండి కిలో ధర సుమారు 800 రూపాయలు తగ్గి రూ.67770 దగ్గర ఉంది.
పెరుగుతున్న ఇంధన ధరలు, ఉక్రెయిన్ ధాన్యం ఎగుమతుల అనిశ్చితి, ఉత్తర కొరియా టెన్షన్‌లాంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు ప్రపంచవృద్ధి ఆందోళనల మధ్య పసిడి ధర 1850 డాలర్లు సమీపంలో కదలాడవచ్చని, అయితే అమెరికా డాలర్ బలం గోల్డ్ ధరలపై ఒత్తిడిని కొనసాగుతుందని కోటక్ సెక్యూరిటీస్‌లోని విపి- హెడ్ కమోడిటీ రీసెర్చ్ రవీంద్ర రావు అన్నారు.