ముంబై: గత కొద్ది రోజుల వరకు ఆకాశాన్ని అంటిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అన్‌సీజన్, ద్రవ్యోల్బణ ఆందోళనలు, డాలర్ బలం పెరగడం, మరియు అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మళ్లీ బంగారం ధర గరిష్ట స్థాయి నుంచి వెనక్కి తగ్గుతోంది.
బంగారం తో పాటుగా వెండి కూడా ఇదే బాటలో సాగుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో నేడు బంగారం ధర బాగా దిగి వచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.10 తగ్గి ధర 47,340 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల కూడా రూ.10 క్షీణించి రూ. 43,390కు చేరుకుంది.
దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి పదిగ్రాములకు 28 రూపాయలు క్షీణించి 46213 వద్ద ఉండగా, 500 రూపాయలు పడిన వెండి 68700 స్థాయికి చేరింది. బంగారం ధరలు 8 నెలల కనిష్టానికి సమీపానికి చేరువలో ఉండటంతోపాటు, రికార్డు స్థాయినుంచి 10 వేల రూపాయలు దిగి వచ్చినట్టయింది.
న్యూఢిల్లీలో 24 క్యారెట్ల పుత్తడి ధర 46,750 స్థాయికిచేరింది. వెండి ధర సిల్వర్ ధర కిలోకు రూ .70,200 స్థాయికి దిగి వచ్చింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 350 రూపాయలు తగ్గి 45,550 రూపాయలకు చేరుకోగా, చెన్నైలో 450 రూపాయలు తగ్గి 43,720 రూపాయలకు పడిపోయింది. అటు యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.4 శాతం తగ్గి 1,767.60 డాలర్లకు చేరుకుంది.
పెరిగిన ఆర్థిక సెంటిమెంట్ ,ద్రవ్యోల్బణ ఆందోళనలు మరియు యూఎస్ బాండ్ ఈల్డ్స్ గరిష్టానికి చేరాయనీ, ఇది బంగారంలో అమ్మకాలకు దారితీసిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ కమోడిటీస్ హరీష్ వీ అన్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ల భారీ పతనంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం కుప్పకూలాయి. ఆరంభ నష్టాలనుంచి మరింత దిగజారిన సెన్సెక్స్ ఏకంగా 1540 పాయింట్లు నష్టపోవడం గమనార‍్హం. దాదాపు అన్ని రంగాలు భారీగా నష్టపోతున్నాయి.