హైదరాబాద్: బల్కంపేట ఆలయానికి శుభవార్త! ‘ప్రసాద్’ స్కీమ్ కింద ఆలయ అభివృద్ధికి కేంద్రం ఆమోదం
‘ప్రసాద్’ పథకం కింద అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పర్యాటక రంగంలో ఆలయాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ‘ప్రసాద్’ (‘Prasad’ scheme) పథకం కింద, హైదరాబాద్‌లోని బల్కంపేట రేణుకా ఎల్లమ్మ దేవస్థానం (Balkampet Renuka Yellamma Temple) అభివృద్ధికి కేంద్రం అనుమతి ఇచ్చింది.
ఈ విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ (Gajendra Singh Shekhawat) స్వయంగా ఎక్స్ (X) వేదికగా వెల్లడించారు. ఈ పథకం కింద ఆలయానికి సంబంధించిన ప్రధాన వసతుల అభివృద్ధికి నిధులు మంజూరు అయ్యాయి.
రూ. 4.21 కోట్లతో అన్నదాన భవనం
ఈ ప్రాజెక్టులో భాగంగా రూ. 4.21 కోట్ల వ్యయంతో మూడు అంతస్తుల అన్నదాన భవనాన్ని నిర్మించనున్నారు. దీని ద్వారా ఒకేసారి 200 మందికి పైగా భక్తులకు వసతి కల్పించే ఆధునిక సౌకర్యాలు అందించనున్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం
ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలపడం పట్ల కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ (Narendra Modi), గజేంద్ర సింగ్ షేకావత్‌లకు ధన్యవాదాలు తెలియజేశారు.
బల్కంపేట ఆలయ అభివృద్ధి భక్తులకు మెరుగైన వసతులు అందించడమే కాకుండా, హైదరాబాద్‌లో ఆధ్యాత్మిక వారసత్వాన్ని మరింత పెంచుతుందని ఆయన అన్నారు.
వేములవాడ ఆలయం ఇప్పటికే ‘ప్రసాద్’ పథకంలో..
ఇంతకు ముందు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (Vemulawada Sri Rajarajeshwara Swamy Temple) కూడా ప్రసాద్ పథకంలో చోటు సంపాదించింది. అక్కడ 100 గదుల అతిథి గృహం, అన్నప్రసాద భవనం, క్యూ కాంప్లెక్స్ అభివృద్ధికి కేంద్రం ఆమోదం తెలిపింది.
ఇప్పుడు బల్కంపేట ఆలయం కూడా ఈ పథకంలో చోటు దక్కించుకోవడం, భక్తులకు మరిన్ని సౌకర్యాలను అందించేందుకు దోహదం చేయనుంది.
తెలంగాణలో ఆలయాల అభివృద్ధికి మరింత బాసట
‘ప్రసాద్’ పథకం కింద ఆలయాలను అభివృద్ధి చేయడం పర్యాటక, ఆధ్యాత్మిక రంగాల రెండింటికీ ఉపయోగకరంగా మారనుంది. తెలంగాణలో మరిన్ని ఆలయాలు ఈ పథకంలో చేరే అవకాశం ఉంది.