తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి ముహూర్తం ఖరారుచేసింది. దసరా రోజున ఈ పథకాన్ని ప్రారంభించి, అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులను జమ చేయనున్నట్లు తెలుస్తోంది. రేపు జరగనున్న తెలంగాణ కేబినెట్ సమావేశంలో పథకం అమలు విధివిధానాలపై చర్చించి, ఆ తరువాత అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే రైతులకు రూ. 2 లక్షల రైతు రుణమాఫీ అందించిన సంగతి తెలిసిందే. మూడు విడతల్లో మొత్తం రూ. 31 వేల కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమచేసింది. ఇంకా కొందరు అర్హులైన రైతులకు రుణమాఫీ నిధులు అందకపోవటంతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వారికి కూడా నిధులను జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, ‘రైతు భరోసా’ పథకం అమలుకు ప్రభుత్వం అన్ని సన్నాహాలు పూర్తి చేసింది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో ముఖ్యమైన అంశంగా ఉన్న ‘రైతు భరోసా‘ పథకం కింద, ప్రతి ఎకరాకు రూ. 15,000 చొప్పున రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఖరీఫ్, రబీ సీజన్లలో రూ. 7,500 చొప్పున రెండు విడతల్లో ఈ నిధులను అందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వ రైతు బంధు పథకం స్థానంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతులు ఇప్పుడు ఆ నిధులు ఎప్పుడెప్పుడు తమ ఖాతాల్లో జమ అవుతాయో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటి వరకు లభించిన సమాచారం ప్రకారం, ‘రైతు భరోసా’ పథకాన్ని వచ్చే నెల 12వ తేదీ, దసరా రోజున అధికారికంగా ప్రారంభించి, ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన రూ. 7,500 నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ సమావేశం అనంతరం పథకానికి అధికారిక ఆమోదం లభించనుంది. మొత్తం 1.53 కోట్ల ఎకరాలకు దాదాపు రూ. 11,475 కోట్ల వ్యయం అంచనా వేస్తున్నారు.
ఈ పథకంపై ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా పథకం అమలు చేస్తామని, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములకు ఈ పథకం వర్తించబోదని స్పష్టం చేశారు. అర్హులైన రైతులకు మాత్రమే పంట పెట్టుబడి సాయం అందించనున్నట్లు మంత్రి తెలిపారు.