హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధులు త్వరలోనే వారి ఖాతాల్లో జమ కానున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మంత్రులు, ప్రజలతో గాంధీభవన్‌లో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
మాది రైతు ప్రభుత్వం
తెలంగాణ రైతుల శ్రేయస్సే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రుణమాఫీ ప్రక్రియ సాంకేతిక కారణాల వల్ల కొన్ని చోట్ల జాప్యం ఎదుర్కొన్నప్పటికీ, సమస్యలను త్వరగా పరిష్కరించి రైతుల ఖాతాల్లో భరోసా నిధులు జమ చేయనున్నామని తెలిపారు. రైతులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, ఈ ప్రక్రియ పూర్తయ్యాక నిధులు ఖాతాల్లోకి వస్తాయని హామీ ఇచ్చారు.
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై తుమ్మల ఘరం
తెలంగాణలో రుణమాఫీ అమలు కాలేదన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మంత్రి తుమ్మల, తెలంగాణలో ఇప్పటికే రూ. 18 వేల కోట్ల రుణమాఫీ చేసిన సంగతి మోడీకి తెలియదా అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ ఎక్కడ జరిగింది అని ప్రశ్నించిన ఆయన, హామీల అమలులో తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తన నిబద్ధతను చాటుకొందని అన్నారు.
తొందరలోనే రైతు భరోసా నిధులు జమ
రుణమాఫీ ప్రక్రియ పూర్తికాగానే రైతు భరోసా నిధులు వెంటనే జమ అవుతాయని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మరియు బీజేపీ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని, రైతులు ఈ బూటకపు ప్రచారాలను నమ్మరాదని సూచించారు.