ముంబై: దేశంలో ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక శుభవార్త చెప్పనుంది. కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని భావిస్తున్నవారికి కాస్త ఊరట లభించనుంది. ఈ అంశంపై ఓ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ, ద్విచక్రవాహనాల పరిశ్రమపై అధ్యయనం చేస్తున్నామని, త్వరలోనే మంచి వార్త వస్తుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో జీఎస్‌టీ పరిమితిని తగ్గిస్తారని, తద్వారా తక్కువ ధరలకే వాహనాలు లభిస్తాయని, కంపెనీలకు ఎంతో లాభదాయకమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సామాన్యులకు ఎక్కువగా ఉపయోగపడే ద్విచక్రవాహనాలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆర్థిక మంత్రి ఇటీవల పేర్కొన్నారు.
ప్రస్తుతం ద్విచక్రవాహనాలకు జీఎస్‌టీ 28 శాతం ఉంది. అయితే ద్విచక్రవాహనాలకు జీఎస్‌టీ తగ్గుతుందన్న వార్తల నేపథ్యంలో హీరో మోటార్ కార్ప్, బజాజ్ ఆటో లిమిటెడ్, టీవీఎస్ మోటార్ కంపెనీల షేర్లు ఒక్కసారిగా 2 నుంచి 6 శాతం పెరిగాయి. త్వరలో జరగనున్న 41వ జీఎస్‌టీ సమావేశంలో ద్విచక్రవాహనాలపై జీఎస్‌టీ శాతం ఎంత ఉండేది స్పష్టత రావచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.