న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా ఎలక్ట్రిక్ కారు కొనాలని భావిస్తున్న వారికి ఒక పెద్ద శుభవార్త. ఏబీబీ, స్విస్ ఇంజనీరింగ్ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కారు ఛార్జర్‌ని “టెర్రా 360” పేరుతో ప్రవేశ పెట్టింది. దాదాపు 3 బిలియన్ డాలర్ల విలువైన ప్రణాళికలతో వచ్చినట్లు సదరు కంపెనీ తెలిపింది.
ఏబీబీ కంపెనీ కొత్తగా విడుదల చేసిన ఈ టెర్రా 360 మాడ్యులర్ ఛార్జర్ ఏకకాలంలో నాలుగు వాహనాలను ఛార్జింగ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటుందని తెలిపింది. కేవలం 15 నిమిషాల్లోనే 500 కి.మీ వెళ్లగల ఒక ఎలక్ట్రిక్ కారును ఫుల్ ఛార్జ్ చేస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే, ఏదైనా ఒక ఎలక్ట్రిక్ కారును 3 నిమిషాల పాటు చార్జింగ్ చేస్తే అది 100 కి.మీల దూరం వరకు ప్రయాణించనున్నట్లు పేర్కొంది. కాగా ఈ కొత్త ఛార్జర్ గరిష్టంగా 360 క్వ్ అవుట్‌పుట్ కలిగి ఉంటుందని సమాచారం.
యూరప్, యునైటెడ్ స్టేట్స్‌లో ఇది ఈ సంవత్సరం చివరికల్లా అందుబాటులోకి వస్తుందని తెలిపింది. లాటిన్ అమెరికా, ఆసియా పసిఫిక్ ప్రాంతాలలో 2022లో ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపింది. ఏబీబీ ఛార్జర్‌లకు ఇప్పుడు డిమాండ్ బాగా పెరుగుతోంది. 2010లో ఈ-మొబిలిటీ వ్యాపారంలోకి ప్రవేశించినప్పటి నుంచి 88కి పైగా మార్కెట్లలో 4,60,000 ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జర్‌లను విక్రయించింది.