న్యూఢిల్లీ: దేశీయ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీదారు అయిన రివోల్ట్ కంపెనీ ఒక శుభవార్తను తెలిపింది. అతి తక్కువ ధరకే ఆర్‌వీ1 అనే నూతన విద్యుత్ బైక్‌ను తొందరలోనే విడుదల చేయబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే ఈ బైక్ ధర ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆర్‌వీ300 కంటే తక్కువ ధరలోనే దొరుకుతుందని పేర్కొంది. వచ్చే సంవత్సరం నుండి ఈ బైక్ ఉత్పత్తిలోకి రానుందని రట్టన్ ఇండియా ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్(ఆర్‌ఈఎల్) ప్రమోటర్ అంజలి రట్టన్ ఒక ప్రకటనలో తెలిపారు.
గుర్గావ్ రివోల్ట్ మోటార్స్ ప్రస్తుతం ఆర్‌వీ400, ఆర్‌వీ300 అనే రెండు రకాల విద్యుత్ బైకులను మార్కెట్‌లోకి విడుదల చేసింది. రివోల్ట్ మోటార్‌లో సుమారు 43 శాతం వాటాను 150 కోట్ల రూపాయలతో రట్టన్ ఇండియా ఎంటర్ ప్రైజెస్ కొనుగోలు చేసింది.
రివోల్ట్ ఆర్‌వీ 400 ప్రస్తుతం ఢిల్లీలో ఎక్స్ షోరూమ్ ధర రూ. 90,799గా ఉండగా, రివోల్ట్ నుంచి త్వరలో రానున్న కొత్త ఆర్‌వీ1 మోడల్ ధర కేవలం రూ. 75 వేల నుంచి రూ. 80 వేల మధ్యనే ఉండే అవకాశం కనిపిస్తోంది. కాగా రివోల్ట్ కంపెనీ డోమినోస్ పిజ్జాతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కొద్ది రోజుల క్రితం రివోల్ట్ ఉంచిన ప్రీ బుకింగ్స్‌లో రికార్దు స్థాయిలో దూసుకుపోయిన విషయం తెలిసిందే.