న్యూయార్క్: గూగుల్ ఏఐ ఫండ్ – సుందర్ పిచాయ్ కీలక ప్రకటన
న్యూయార్క్‌లో జరిగిన 79వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) సమావేశంలో ప్రపంచంలోని ప్రముఖ నాయకులు, శాస్త్రవేత్తలు, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘యూఎన్ సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’ కార్యక్రమంలో, ఆల్ఫాబెట్ ఇంక్ మరియు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఒక కీలక ప్రకటన చేశారు. పిచాయ్ గ్లోబల్ ఏఐ ఆపర్చునిటీ ఫండ్‌ను ప్రకటించారు, ఇందులో గూగుల్ 120 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,000 కోట్లు) సమకూరుస్తోంది.
ఈ నిధులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీలలో ఏఐ విద్య, శిక్షణ కోసం వినియోగించనున్నట్లు పిచాయ్ వెల్లడించారు. ఇందుకోసం గూగుల్ లాభాపేక్షలేని సంస్థలు, ఎన్‌జీఓలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటుందని, ఏఐ ఎడ్యుకేషన్‌ను స్థానిక భాషల్లో అందిస్తామని తెలిపారు.
గూగుల్ సేవలు 246 భాషల్లో అందుబాటులో
ఈ కార్యక్రమంలో పిచాయ్ మాట్లాడుతూ, “ప్రపంచవ్యాప్తంగా 15 గూగుల్ ఉత్పత్తులు 50 కోట్ల మంది వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి. వాటిలో గూగుల్ సెర్చ్ ఇంజిన్, మ్యాప్స్, డ్రైవ్ ముఖ్యమైనవి. గత రెండు దశాబ్దాలుగా గూగుల్ ఏఐ సెర్చ్ మరియు టెక్నాలజీ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెడుతోంది. గతేడాది గూగుల్ ట్రాన్స్‌లేట్ 110 కొత్త భాషల్లో సేవలను విస్తరించాం. ఇప్పుడు గూగుల్ సేవలు 246 భాషల్లో అందుబాటులో ఉన్నాయి” అని వెల్లడించారు.
ఏఐ ప్రభావం – ప్రపంచ జీడీపీపై 7 శాతం పెరుగుదల
ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే 1,000 భాషల్లో గూగుల్ సేవలు అందుబాటులోకి తీసుకురావడంపై కృషి చేస్తున్నామని పిచాయ్ అన్నారు. ఏఐ ప్రపంచ వ్యాప్తంగా శ్రామిక ఉత్పాదకతను 1.4 శాతం పాయింట్లకు పెంచుతుందని, రాబోయే దశాబ్దంలో ప్రపంచ జీడీపీని 7 శాతం పెంచడంలో సహాయపడుతుందని చెప్పారు. కనెక్టివిటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ట్రాఫిక్ రద్దీ వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.