న్యూయార్క్: కరోనా విజృంభణ గురించి పట్టించుకోకుండా తమ ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించాలన్న పెద్ద పెద్ద కంపెనీల నిర్ణయానికి ఇప్పుడు బ్రేకులు పడుతున్నాయి. ఈ విషయం పై అందరికంటే ముందుగా నిర్ణయాలు ప్రకటించే ఆల్పాబెట్ కంపెనీ గూగుల్ ఇప్పుడూ కూడా తాజాగా ఉద్యోగులకు అందరికంటే ముందుగానే గుడ్‌న్యూస్ చెప్పింది.
రాబోయే జనవరి నుండి ఉద్యోగులు ఆఫీసులకు తప్పనిసరిగా రావాలన్న ఆదేశాల్ని గూగుల్ నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం గూగుల్ ఎంప్లాయిస్‌కు తమ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. ప్రపంచం మొత్తం మీద ఒమిక్రాన్ వేరియెంట్ భయాందోళనలు, ఉద్యోగులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి అనే ఆదేశాలపై నిరసన సెగలు తగిలిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అయితే గూగుల్ జనవరి నుంచి వర్క్‌ఫ్రమ్ హోం పాలసీకి ముగింపు పలకాలని, వారంలో కనీసం మూడు రోజుల చొప్పున వ్యాక్సినేషన్ పూర్తైన వాళ్లను ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఈ మేరకు ఉద్యోగులతో సిద్దంగా ఉండాలని కూడా తేల్చి చెప్పింది. కరోనా డెల్టా వేరియెంట్ భయాందోళనలు సైతం పట్టించుకోకుండా ముందుకెళ్లాలని అనుకుంది.
కాగా ఈ నిర్ణయాన్ని గూగుల్ అమలు పరచే లోపే అత్యంత వేగంగా వ్యాప్తిచెందే ఒమిక్రాన్ వేరియెంట్ వల్ల ఇప్పుడు ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ఆఫీస్ రిటర్న్ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ, సాధారణ పరిస్థితి నెలకొనే పరిస్థితులను సమీక్షించాకే తదుపరి నిర్ణయం తీసుకుంటామని గూగుల్ ఎగ్జిక్యూటివ్స్, ఉద్యోగులతో పేర్కొన్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగులు గత కొన్నివారాలుగా ఆఫీసులకు ‘క్యూ’ కడుతున్నారంటూ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే ఈ ప్రకటన వెలువడిన కొన్నిగంటలకే వందల మంది ఉద్యోగులు, వ్యాక్సినేషన్ తప్పనిసరి పాలసీపై నిరసన వ్యక్తం చేయడం, వర్క్‌ఫ్రమ్ హోం పాలసీలో మరికొన్నాళ్లు కొనసాగుతామని డిమాండ్ చేయడంతో గూగుల్ ఇరకాటంలో పడీ తన నిర్ణయాన్ని మార్చుకుంది.