న్యూఢిల్లీ : ఐటీ దిగ్గజం గూగుల్ భారత దేశంలో భారీ పెట్టూబడులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భారత్ లో రాబోయే 5 నుండి 7 సంవత్సరాల కాలంలో రూ 75,000/- కోట్ల వరకు వెచ్చిస్తామని గూగుల్ తెలిపింది.
గూగుల్, అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ గూగుల్ వెచ్చించే భారత డిజిటలీకరణ నిధిని తాను సగర్వంగా ప్రకటిస్తున్నానని గూగుల్ ఫర్ ఇండియా వర్చువల్ ఈవెంట్‌లో ప్రకటీంచారు. ఈ పెట్టుబడుల మొత్తాన్ని భాగస్వామ్యాల నిర్వహణ, ఈక్విటీ పెట్టుబడులు వంటి వివిధ రూపాల్లో సమకూరుస్తామని స్పష్టం చేశారు.
భారత్ భవిత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై తమకున్న నమ్మకానికి ఈ భారీ పెట్టుబడులే నిదర్శనమని సుందర్ పిచాయ్ అన్నారు. భారత దేశ డిజిటలీకరణలో కీలకమైనటువంటి నాలుగు రంగాలలో తమ ఈ పెట్టుబడులపై దృష్టిసారిస్తామని తెలిపారు.
ప్రతి భారతీయునికి తన మతృ భాషలో కావలసిన సమాచారాన్ని చేరవేయడం, భారత్ లోని ప్రజల అవసరాలకు అనువైన ఉత్పత్తులు, సేవలను అభివృద్ధి చేయడం, పరిశ్రమలు డిజిటల్ బాట పట్టేలా తోడ్ఫాటు అందించడం, సామాజిక ప్రయోజనాలైన వైద్యం, విద్య, సేద్యం వంటి రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమలు వంటి కీలక రంగాల్లో పెట్టుబడులను ఉపయోగిస్తామని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన డిజిటల్ ఇండియా విజన్‌ను సుందర్ పిచాయ్ ప్రశంసిస్తూ భారత్ ఆన్‌లైన్ వేదికలో చాళా మంచి పురోగతి సాధించిందని కీర్తించారు. డిజిటల్ కనెక్టివిటీకి లోతైన పునాదులు నిర్మించడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చారు. భారత్ లో తక్కువ ధరలకే స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రావడం, తక్కువ ధరలలో డాటా అందుబాతు, అంతర్జాతీయ స్ధాయి మౌలిక వసతులతో నూతన అవకాశాలకు మార్గం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు.
గూగుల్ హైదరాబాద్, బెంగళూర్ నగరాల్లో 2004వ సంవత్సరంలో తమ కార్యాలయాలను ప్రారంభించిన సందర్భంలో భారతీయ యూజర్లకు మెరుగైన సెర్చ్ సేవలను అందించడంపైనే ఫోకస్ చేశామని చెప్పారు.