ఏపీ: 2024 ఎన్నికల తర్వాత వైసీపీలో అంతర్యుద్ధం ముదురుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, కూటమి ప్రభుత్వంలో కూడా అంతర్యుద్ధం మొదలైందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే, ఆయన వ్యాఖ్యలకు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత కౌంటర్ ఇస్తూ తీవ్రంగా స్పందించారు. కూటమిలో అంతర్యుద్ధం లేదని, కానీ వైసీపీలోనే అంతర్యుద్ధం జరుగుతోందని అనిత వ్యాఖ్యానించారు.
వాక్ స్వాతంత్ర్యం ఉంది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడితే కుదరదని హెచ్చరించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, రెడ్ బుక్ అమలు అయితే వైసీపీ నేతలు బయట తిరగలేరని స్పష్టం చేశారు.
ఇక, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిపై రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయని అనిత తెలిపారు. కక్ష సాధింపు చర్యలు ఎవరిపైనా చేపట్టడం లేదని, నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పోలీస్ శాఖకు రూ. 900 కోట్ల బకాయిలు పెరిగిపోయాయని అనిత ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆ మొత్తాన్ని తీర్చేందుకు చర్యలు తీసుకుంటుందని వివరించారు.
ఏపీలో త్వరలో ‘అప్పా’ ఏర్పాటు చేయనున్నామని, అలాగే గ్రే హౌండ్స్ బెటాలియన్ కోసం భూమిపూజ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అనిత వెల్లడించారు. గోరంట్ల వ్యాఖ్యలు అవాస్తవమని ఆమె తేల్చిచెప్పారు.