అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల కేటాయింపు, పంపిణీ అనే ప్రక్రియలు నిరంతర కార్యక్రమాలు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ఇంటి స్థలాల పట్టా కోసం అర్జీదారు దరఖాస్తు తీసుకున్న రెండు మూడు వారాల్లో భౌతిక తనిఖీ, అర్హతల పరిశీలన మరియు సోషల్ ఆడిట్ ప్రక్రియలన్నీ పూర్తి చేయాల్సిన బాధ్యత వలంటీర్ మరియు గ్రామ సచివాలయ సిబ్బందిదేనని స్పష్టం చేశారు.
ఇళ్ళ స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న సదరు లబ్ధిదారు అర్హులని తేలితే వారికి కచ్చితంగా 90 రోజుల్లో ఇంటి స్థలం పట్టా ఇవ్వాల్సిందేనని సీఎం ఆదేశించారు. పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ పురోగతితో పాటు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకుంటున్న చర్యలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
సీఎం జగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, సామాజిక తనిఖీల ద్వారా లబ్ధిదారులను గుర్తించాలన్నారు. నిర్మాణాల్లో ఏక రూపత మరియు నాణ్యత కోసం తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. త్వరలో నిర్మించనున్న వైఎస్సార్ జగనన్న కాలనీల్లో కల్పిస్తున్న సదుపాయాలు, వాటి నిర్మాణ రీతులు తదితర అంశాలపై పూర్తి వివరాలను ఆయా కాలనీల వారీగా వేర్వేరుగా నివేదించాలని చెప్పారు.
ఈ కాలనీల్లో ఇంటర్నెట్ సదుపాయం కూడా అందుబాటులో ఉంచాలని, ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. డంపింగ్ యార్డుల్లో బయో మైనింగ్ చేయాలని, వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను మొదలు పెట్టాలని ఆయన సూచించారు.