ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ దొరికింది. దరఖాస్తు వివరాలు ఇవే..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమైంది. రేషన్ కార్డుల జారీపై పేద ప్రజల విజ్ఞాపనలను దృష్టిలో ఉంచుకుని, వచ్చే నెల డిసెంబరు 2వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించనుంది. సంక్రాంతి పండుగ నాటికి కొత్త రేషన్ కార్డులను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కొత్త రేషన్ కార్డుల కోసం ప్రత్యేక చర్యలు
ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్త డిజైన్‌తో కార్డులను ముద్రించి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్యూఆర్ కోడ్, కుటుంబ సభ్యుల ఫోటోలు కలిగి ఉన్న కొత్త టెక్నాలజీ ఆధారిత కార్డులను లబ్ధిదారులకు ఉచితంగా అందించనున్నారు.
దరఖాస్తు ప్రక్రియకు తేదీలు
డిసెంబరు 2వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించి, జనవరి 1వ తేదీ అర్హతను పరిశీలించి సంక్రాతి కానుకగా కార్డులను పంపిణీ చేయనున్నారు.
ప్రస్తుత కార్డుల్లో మార్పులు
ప్రస్తుత రేషన్ కార్డుల్లో ముఖ్యమైన మార్పులు చేస్తూ కొత్తవిగా ముద్రించనున్నారు. ప్రస్తుతం ఉన్న కార్డుల్లోని వైఎస్ జగన్ ఫోటోలను తొలగించి, క్యూఆర్ కోడ్, కుటుంబ సభ్యుల సమాచారం వంటి ఆధునిక ఫీచర్లతో కొత్త కార్డులను తయారుచేయనున్నారు.
కొత్తగా పెళ్లయిన వారికి..
కొత్తగా పెళ్లైన వారు రేషన్ కార్డులు పొందడానికి, వారి కుటుంబాల నుంచి పేర్లు తొలగించాల్సిన అవసరం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ సమస్యకు పరిష్కారంగా వివాహ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా కొత్త జంటకు ప్రత్యేకంగా కార్డులు జారీ చేయనున్నారు.
అర్హుల నిర్ధారణపై ప్రత్యేక దృష్టి
గత ప్రభుత్వం హయాంలో అనర్హులకు కార్డులు జారీ చేశారనే విమర్శలు ఉన్న నేపథ్యంలో, కొత్తగా అన్ని దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు చేపట్టారు.
గ్రామసభల నిర్వహణ
నూతన రేషన్ కార్డుల జారీకి సంబంధించి గ్రామసభలను కూడా నిర్వహించనున్నారు. ఈ సభల్లో అర్హుల జాబితాను ఖరారు చేస్తారు.
పేదల కోసం..
రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది పేదల అవసరాలను తీర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రేషన్ కార్డుల ద్వారా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందే వీలున్నందున, ప్రతి అర్హుడికి కార్డులు అందించేందుకు కృషి చేస్తున్నారు.