హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన కొత్త జీఎస్టీ ప్రతిపాదనలపై తమ అభ్యంతరం వ్యక్త పరుస్తూ ప్రధానమంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక లేఖ రాశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల సమ్మతి లేకుండా జీఎస్టీ నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా తీసుకున్నవే అని, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం డిమాండ్ చేశారు. కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయం భారీగా పడిపోయిందని, ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర నూతన ప్రతిపాదనలు ఫెడరల్ స్ఫూర్తికి చాలా వ్యతిరేకంగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.
జీఎస్టీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే.. దేశం అభివృద్ధి చెందినట్లే అని పేర్కొన్నారు. బలమైన రాష్ట్రాలు ఉంటేనే బలమైన దేశం అవుతుందన్నారు. కరోనా క్లిష్ట సమయంలోరుణాలపై ఆంక్షలు సహేతుకం కాదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ఏప్రిల్ నుంచి రాష్ట్రాలకు కేంద్ర నుంచి జీఎస్టీ పరిహారం అందలేదు. కోవిడ్-19 కారణంగా 2020, ఏప్రిల్ నుంచి తెలంగాణ ప్రభుత్వం 83 శాతం రెవెన్యూను కోల్పోయింది. అదే సమయంలో రాష్ట్రాల అవసరాలు, పేమేంట్ల భారం పెరిగిపోయింది. మార్కెట్ బారోయింగ్స్ ద్వారా, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్‌లు, ఓవర్ డ్రాఫ్ట్ ల ద్వారా ఈ పరిణామాల నుంచి గట్టెక్కాల్సి వచ్చింది.
దేశ ఆర్థిక వ్యవస్థ, విత్త విధానం కేంద్రం చేతుల్లో ఉన్న కారణంగా రాష్ట్రాలు విధిగా కేంద్రంపై ఆధారపడే పరిస్థితులు నెలకొన్నాయి. మార్కెట్ బారోయింగ్‌లకు కేంద్రంపై ఆధారపడాల్సి వస్తుంది. ఇది సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని’ సీఎం తన లేఖలో పేర్కొన్నారు.