భువనేశ్వర్: గత సంవత్సరం మార్చి లో భారత్ పై ప్రభావం చూపడం మొదలుపెట్టిన కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టింది. ఒక వైపు కేసులు తగ్గడం మరో వైపు వ్యాక్సిన్ వచ్చిందన్న శుభవార్త తో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా ఇప్పుడు మరో టెన్షన్. వ్యాక్సిన్ వచ్చిందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కోవిడ్ టీకా వేసుకుంటున్న వారు తాజాగా తీవ్ర అస్వస్థతకు లోను కావడం, మరణిస్తుండటంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు.
తాజాగా ఒడిశాలో కోవిడ్ టీకా వేసుకున్న ఆస్పత్రి సెక్యూరిటీ గార్డ్ మూడు రోజులకే ప్రాణాలు విడిచాడు. నౌపద జిల్లాలోని దియాన్‌ముందకు చెందిన 27 ఏళ్ల వ్యక్తి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. జనవరి 23న అతడు కోవిడ్ వ్యాక్సిన్ టీకా తీసుకున్నాడు. ఎప్పటిలాగే విధుల్లోకి వచ్చిన అతడు సోమవారం అనారోగ్యం పాలు కావడంతో అదే ఆస్పత్రిలో చేరాడు.
అతని పరిస్థితి విషమించడంతో వీఐఎమ్‌ఎస్‌ఏఆర్ ఆస్పత్రికి తరలించగా మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచాడు. కాగా అతడు మాత్రం వ్యాక్సిన్ వల్ల చనిపోలేదని నౌపద జిల్లా ప్రధాన వైద్యాధికారి కాళీప్రసాద్ బెహెరా పేర్కొంటున్నారు. ఆ వ్యక్తి ఇప్పటికే అనీమియా, థ్రాంబోసైటోపేనియా వంటి వ్యాధులతో సతమతమవుతున్నాడని, ఈ క్రమంలో అతడి ప్లేట్‌లెట్స్ తగ్గిపోయి, అనారోగ్యంతో మరణించాడని అంటున్నారు.