తెలంగాణ: తెలంగాణ కులగణన నిర్వహణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. బోయిన్‌పల్లి గాంధీ తత్వ చింతన కేంద్రంలో బీసీ సంఘాలు, మేధావులతో జరిగిన ముఖాముఖి సమావేశంలో రాహుల్ గాంధీ కులగణన ప్రాధాన్యతపై ఆలోచనలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “కుల వ్యవస్థ, కుల వివక్ష దేశంలో అసమానతలు పెంచుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం కులగణన ద్వారా సాధ్యమవుతుందని నమ్ముతున్నాను,” అని చెప్పారు.
కులగణనలో ప్రశ్నలను కేవలం అధికారులే కాకుండా సామాన్యులు నిర్ణయించే విధంగా ఉండాలని రాహుల్ పిలుపునిచ్చారు. “కులగణన ద్వారా దళితులు, ఓబీసీలు, మహిళలు లాంటి సామాజిక వర్గాల సంఖ్యపై స్పష్టత వస్తుంది. రిజర్వేషన్ల పరిమితిని తొలగించడానికి కృషి చేస్తామని, పార్లమెంట్‌లో దీనిపై స్పష్టంగా చెప్పాం,” అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘దేశంలో కుల వ్యవస్థ, కుల వివక్ష ఉందని అంగీకరిద్దాం. నేను దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నానని ఆరోపణలు చేస్తున్నారు. దేశం గురించి నిజం చెబితే దేశాన్ని విభజించడమా? కులగణన ద్వారా దళితులు, ఓబీసీలు, మహిళల సంఖ్యపై స్పష్టత వస్తుంది. కులగణన తర్వాత ఎవరి దగ్గర ఎంత ఆర్థిక వనరులున్నాయో తెలుసుకుందాం. కులగణన చేస్తామని పార్లమెంట్‌లో స్పష్టంగా చెప్పాను. రిజర్వేషన్ల పరిమితిని తీసేస్తాం’’ అని రాహుల్ గాంధీ అన్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కులగణన నిర్వహణకు సిద్ధమవుతూ, బుధవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.
కులగణన కార్యక్రమంలో విద్యార్థులపై ప్రభావం ఉండకుండా ప్రాథమిక పాఠశాలలకు ఒంటిపూట బడులను ప్రకటించింది. తెలంగాణలో ఈ కీలక నిర్ణయం దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.