గాంధీనగర్: గుజరాత్ రాష్ట్ర బీజేపీ శాసనసభ్యురాలు ఆశాబెన్ పటేల్ అనారోగ్యంతో చనిపోయారు. డెంగ్యూ బారిన పడ్డ ఆశాబెన్ అహ్మదాబాద్‌లోని జైడస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం తుదిశ్వాస వదిలారు. ఇంతకు ముందు తాను కోవిడ్ బారినపడినట్టు కూడా తెలిసింది. ఆమె మరణ వార్తను ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ వీఎన్ షా తన ప్రకటనలో ధ్రువీకరించారు.
2015 సంవత్సరంలో ఆమె పాటిదార్ రిజర్వేషన్ల అంశంపై పోరాడిన కీలక వ్యక్తుల్లో ఒకరు. ఆశాబెన్ పటేల్ హార్దిక్ పటేల్‌కు సన్నిహితురాలు. 2017లో ఉంఝా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసి ఆమె విజయం సాధించారు. ఆరుసార్లు బీజేపీ తరపున ఆ స్థానం నుంచి గెలిచి సత్తా చాటిన మాజీ మంత్రి నారాయణ్ పటేల్‌ని ఆమె ఆ ఎన్నికల్లో మట్టి కరిపించారు.
కాగా కాంగ్రెస్ పార్టీతో విభేదాల వల్ల ఆమె 2019 లో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ తరపున ఉప ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె గెలుపొందారు. ఆశాబెన్ అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.