అమరావతి : ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్రం మొత్తంలో వైఎస్సార్ సీపీ శ్రేణుల రక్తదాన శిబిరాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో రక్తదాన కార్యక్రమం అత్యంత అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దాదాపు 175 నియోజకవర్గాలో పార్టీ శ్రేణులు చేపట్టిన రక్తదానం 18 వేల యూనిట్లను దాటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును బద్ధలు కొట్టింది.
ఇంతకుముందు రక్తదానంలో 10,500 యూనిట్లుగా ఉన్న గిన్నిస్ రికార్డ్‌ను ఈ రికార్డు తుడిచిపెట్టింది. ప్రస్తుత రికార్డ్‌ను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నమోదు చేసుకుంది. కాగా, సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్బంగా సాక్షి టీవీలో ఆవిష్కరించిన ప్రత్యేక పాట ‘ఒక నిజం జన్మించిన రోజు.. ఒక తేజం ఉదయించిన రోజు.. పుట్టినరోజు జగనన్న పుట్టినరోజు’ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, కోవిడ్ నేపథ్యంలో ల్యాబ్‌ల్లో బ్లడ్ కొరత నెలకొందని, దాని కోసమే ఈ రక్తదానం పెద్దఎత్తున చేపట్టాలని కోరామని తెలిపారు. 4వేల యూనిట్ల తక్కువ దశకు పడిపోయిన వేళ 34వేల యూనిట్లకు పైగా అందించాం. సేవా కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ ముందు ఉంటుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో గత పదేళ్ల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పార్టీ శ్రేణులు రక్తదానం చేశారని పేర్కొన్నారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నిలవడం సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్‌పై అభిమానంతో ప్రజలు కూడా రక్తదానం చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.