సగం జనాభాలో హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉంది అంటున్న నోబెల్ గ్రహీత బ్యారీ మార్షల్
హెల్త్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకర స్థాయిలో ఉన్న హెలికోబ్యాక్టర్ పైలోరీ (హెచ్ పైలోరీ) బ్యాక్టీరియా విషయమై ఆస్ట్రేలియా వెస్ట్రన్ యూనివర్సిటీ క్లినికల్ మైక్రోబయాలజీ ప్రొఫెసర్, నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ బ్యారీ మార్షల్ ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలో సగం మందికి పైగా జనాభాలో ఈ బ్యాక్టీరియా ప్రభావం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. జీర్ణాశయం, పేగుల ఆరోగ్యానికి భంగం కలిగిస్తూ, కొద్ది మంది బాధితులలో దీర్ఘకాలంలో పొట్ట క్యాన్సర్‌ను సృష్టించే ప్రమాదం ఉంది.
డాక్టర్ బ్యారీ మార్షల్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ)లో ‘హెచ్ పైలోరీ’పై ప్రత్యేక పరిశోధనల కోసం తన పేరుతో నామకరణం చేసిన ‘బ్యారీ మార్షల్ సెంటర్’ను డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా, అపరిశుభ్రత, కలుషిత తాగునీరు తదితర కారణాలతో ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుందని, ఇంట్లో ఒకరికి సోకితే మిగతా వారికి కూడా సోకే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.
ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, దేశంలో హెచ్ పైలోరీ కేసులు మధుమేహం కంటే 10 రెట్లు అధికంగా ఉన్నాయని వెల్లడించారు. గతంలో ఏఐజీలో అజీర్తి, కడుపు నొప్పి, వాంతులు వంటి లక్షణాలతో వచ్చిన రోగులలో 700 మందిని పరిశీలించినప్పుడు, 300 మందిలో హెచ్ పైలోరీ వ్యాప్తి నిర్ధారించారు. ఈ పరిశోధనల ద్వారా ఆరోగ్య సంరక్షణ విధానాన్ని రూపొందించేందుకు ఏఐజీ నిబద్ధతతో పనిచేస్తుందని ఆయన తెలిపారు.