ముంబై: చాలా రోజులుగా వాయిదా వేసుకొస్తున్న హాల్ మార్కింగ్ ఖచ్చితం అనే విధానం ఎట్టకేలకు రేపటి నుండి అమల్లోకి వస్తోంది. రేపు అనగా 2021 జూన్ 15 నుంచి హాల్‌మార్క్ ఉన్న బంగారు ఆభరణాలను మాత్రమే అమ్మాల్సి ఉంటుంది. ఇక నుండి హాల్‌మార్క్ లేని బంగారం విక్రయించడం చట్టపరంగా నేరం అవుతుంది. ఈ నూతన విధానం వల్ల బంగారం నాణ్యత విషంయలో కష్టమర్లకు మరింత భరోసా లభిస్తుంది.
చాలా వరకు చిన్న పట్టణాల్లో అలాగే గ్రామాల్లో బంగారు ఆభరణాల తయారీకి హాల్ మార్కింగ్ ఉండదు. అందు వల్ల ఆ బంగారు ఆభరణాలు ఎంత వరకు నాణ్యమైనవి అనే సందేహాలు ఉంటున్నాయి. అనేక సందర్భాల్లో ప్రజలు ఆ బంగారు ఆభరణాలు కొన్న తర్వాత తాము మోసపోయినట్టు వినియోగదారులు చెబుతున్నారు. ఇలాంటి బంగారం కల్తీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం హాల్‌మార్క్ విధానం అమల్లోకి తెచ్చింది.
ఇక నూతన విధానం వల్ల అన్ని రకాల 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 14 క్యారెట్ల బంగారు ఆభరణాలపై హాల్ మార్క్ తప్పనిసరిగా ఉండి తీరాలి. బీఐఎస్ హాల్‌మార్కింగ్ స్కీంలో ఆభరణాలకు రిజిస్ట్రేషన్ మంజూరు, మదింపు, హాల్ మార్కింగ్ కు గుర్తింపు లభిస్తుంది. ఆభరణాల హాల్ మార్కింగ్ ప్రక్రియలో బీఐఎస్-ఏహెచ్ సెంటర్‌లో నాణ్యతను తనిఖీ చేస్తారు. ఇక్కడ పరీక్షించిన అనంతరం ఏహెచ్ సెంటర్‌లో హాల్ మార్కింగ్ ముద్రను వేస్తారు.