విశాఖపట్నం: ఏపీలో వైజాగ్ మాజీ ఎంపీ అయిన బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబును మిజోరాం రాష్ట్ర గవర్నర్‌గా నియమించిందంతో విశాఖలో అన్ని వర్గాల వారి నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. హరిబాబు ప్రకాశం జిల్లాలో జన్మించినప్పటికీ విద్యార్థి నుంచి విశాఖలోనే స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. విద్య, ఉద్యోగం, రాజకీయ ప్రస్థానం విశాఖ కేంద్రంగానే సాగించారు.
హరిబాబు పాఠశాల విద్యను పూర్తి చేశాక ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశారు. అదే యూనివర్సిటీ నుండే పీహెచ్‌డీ పట్టా కూడా పొందారు. అక్కడే అసోసియేట్ ప్రొఫెసర్‌గా కూడా విధులు నిర్వర్తించారు. 1993లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
విద్యార్థి దశనుండే ఆయన నాయకుడిగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1972–73లో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి యూనియన్‌కు సెక్రటరీ అయ్యారు. 1975 లో లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆధ్వర్యంలో జరిగిన లోక్ సంఘర్ష సమితి ఉద్యమంలో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ కాలంలో అంతర్గత భద్రతలో భాగంగా అరెస్ట్ అయ్యారు. విశాఖ సెంట్రల్ జైలు, ముషీరాబాద్ జైలులో 6 నెలలు ఉన్నారు.
ఆయన జైఆంధ్రా ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. 1977లో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. జనతా పార్టీలో చేరి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా సేవలందించారు. 1978లో జనతా యువమోర్చాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1991–93 మధ్యలో పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఉన్నారు. 1993–2003 కాలంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు.
మిజోరం గవర్నర్‌గా నియమితులైన హరిబాబుకు అభినందనలు వెల్లువెత్తాయి. దసపల్లా హిల్స్ ప్రాంతంలో ఉన్న ఆయన నివాసం ఒక్క సారిగా సందడిగా మారింది. బీజేపీ నేతలతో పాటు అన్ని పక్షాల నేతలు, సన్నిహితులు హరిబాబు ఇంటికి వెళ్లి ఆయనను పుష్పగుచ్ఛాలతో అందజేసి అభినందించారు. బీజేపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర, బీజేపీ జిల్లా ఇన్‌చార్జి కోడూరి లక్ష్మీనారాయణ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.