తెలంగాణ: లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. లగచర్లకు వెళ్తున్న మాజీ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిని పోలీసులు అడ్డుకోవడంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
ఈ ఘటన రాజ్యాంగ హక్కులకు తూట్లు పొడిచినట్టుగా ఉందని, కాంగ్రెస్ పాలనలో ప్రాథమిక హక్కులు సైతం రక్షించబడడం లేదని ఆయన పేర్కొన్నారు.
రాహుల్ గాంధీకి సంభాల్ ప్రాంతాన్ని సందర్శించే హక్కు ఉంటే, మధుసూదనాచారికి లగచర్లను సందర్శించే హక్కు లేదా? అని ప్రశ్నించిన హరీశ్ రావు, ఇది కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనమని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
రాజ్యాంగ విలువలను పక్కన పెట్టి తమ ప్రయోజనాల కోసం పోలీసులు వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
హరీశ్ రావు ట్వీట్‌లో, “సంభాల్‌కు రాహుల్ గాంధీ వెళ్ళవచ్చు, కానీ లగచర్లకు మధుసూదనాచారి వెళ్లకూడదా? ఇది సిగ్గుపడాల్సిన విషయం” అని పేర్కొన్నారు.
ఈ చర్యలు ప్రజాస్వామ్య విలువలను తాకట్టుపెట్టినట్టుగా కనిపిస్తాయని, ప్రజల మధ్య కాంగ్రెస్ పట్ల నమ్మకం మరింత తగ్గుతుందని హరీశ్ రావు విమర్శించారు.