తెలంగాణ: అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ డేటాను నమ్ముకుంటే, రేవంత్ రెడ్డి మాత్రం డర్టీ ట్రిక్స్ నమ్ముకున్నారని ఆరోపించారు. జగదీశ్ రెడ్డిని ఏకపక్షంగా సస్పెండ్ చేయడం దారుణం అని అన్నారు.
రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన భాషపై హరీశ్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘సీఎం బూతులకు జీఎస్టీ వేస్తే, రాష్ట్ర ఖజానా సరిపోదు’’ అంటూ ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ ప్రతిపక్ష నేతలను గౌరవంగా పిలిచేవారని గుర్తుచేశారు. రుణమాఫీపై ప్రభుత్వం గోబెల్స్ ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణ జీఎస్డీపీలో నంబర్ వన్ అని, తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో ఉందని గుర్తు చేశారు. విద్యుత్, వరి ఉత్పత్తిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని తెలిపారు. రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించిందని చెప్పారు.
ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టులు కూలిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి అని విమర్శించారు. రేవంత్ రెడ్డి వల్ల రైతులు, ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. కేసీఆర్ ఆదేశాలను పాటించేందుకే తాను మంత్రి పదవికి రాజీనామా చేశానని స్పష్టం చేశారు.
“రాష్ట్రానికి పట్టిన శని రేవంత్ రెడ్డి” అని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల రుణమాఫీ పూర్తయ్యే వరకు, మహాలక్ష్మి పథకం అమలు అయ్యే వరకు రేవంత్‌ను వెంబడిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో చేరి రేవంత్ సీనియర్లను తొక్కిపడేసి, పదవి కొనుక్కున్నారని ఆరోపించారు.