తెలంగాణ: రేవంత్ రెడ్డి అబద్దాలకు పిహెచ్‌డీ ఇవ్వాలన్న హరీష్ రావు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పడంలో నిపుణుడని, ఆయనకు పిహెచ్‌డీ ఇవ్వాలని బీఆర్ఎస్ నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి చెప్పే అబద్ధాలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
తెలంగాణలో జరిగిన అభివృద్ధి చర్యలను తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
మహారాష్ట్రతో సరిహద్దులో ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతల 6 గ్యారంటీలపై మహారాష్ట్ర ప్రజలు కూడా విశ్వాసం కోల్పోయారని, దాంతో వారిని ఓడించారని హరీష్ రావు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నేతలు నిజాలను గుర్తించి, తమ విధానాలను మార్చుకోవాలని సూచించారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు, వ్యవసాయ భూముల రక్షణ వంటి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న హరీష్ రావు, కాంగ్రెస్ విధానాలపై విమర్శలు గుప్పించారు.
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి, ఆపై వాటిని అమలు చేయకపోవడాన్ని ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు.
దళిత బంధు వెంటనే అమలు చేయాలి
హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు కోసం 18,500 మందికి కేటాయించిన పథకాన్ని ఆపారని, పేదలకు అర్హత కల్పించిన ఐదు లక్షల రూపాయలను అందించకపోవడం అన్యాయమని అన్నారు. ఆ డబ్బులు తిరిగి వారికి అందేలా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
ఫార్మాసిటీ vs ఇండస్ట్రియల్ కారిడార్
లగిచర్లలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్ ఇప్పుడు మాట మార్చి ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
గతంలోనే ఫార్మాసిటీకి సంబంధించి ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందని గుర్తు చేస్తూ, ఆ గెజిట్‌ను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు రేవంత్ పై విమర్శలు
కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తూ, ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పడం అబద్ధమని, నిజానికి కేవలం రెండు ఫిల్లర్లకే నష్టం జరిగిందని హరీష్ రావు వివరించారు.
ధాన్యం కొనుగోలు విషయంలో ఘనత తమదే
ధాన్యం కొనుగోలు, భగీరథ ప్రాజెక్టుల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఘనత సాధించిందని, ఇకపై కూడా ప్రజల కోసం పనిచేస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.