హరియాణా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. లోక్‌సభ ఎన్నికల అనంతరం జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కీలకంగా పోటీ పడ్డాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఒక్కొక్కటికి 90 సీట్లు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు 46 స్థానాల్లో మెజార్టీ అవసరం. హరియాణా, జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారుచేస్తూ ఉత్కంఠ రేపుతున్నాయి.
హరియాణా ఎన్నికల ఉత్కంఠ
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్‌లు కాంగ్రెస్ విజయాన్ని ముందస్తుగా ఊహించినప్పటికీ, ఫలితాలు అంచనాలను తారుమారుచేస్తూ బీజేపీ ముందంజలో ఉంది. ఈ వార్త రాసేనాటికి బీజేపీ 48 స్థానాల్లో, కాంగ్రెస్ 36 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. హరియాణాలో గతంలో ఏ పార్టీ మూడోసారి అధికారంలోకి రాకపోయినా, బీజేపీ ఆ సంప్రదాయాన్ని అధిగమించే అవకాశం కనిపిస్తోంది. తమ అభివృద్ధి చర్యలే మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. కాంగ్రెస్ మొదట్లో పోస్టల్ బాలట్ లో భారీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ, ఇప్పుడు బీజేపీ మళ్లీ అనూహ్యంగా ట్రెండ్‌లోకి వచ్చింది.
జులానా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ రెజ్లర్ వినేశ్ ఫోగట్ 30 ఓట్ల అతి స్వల్ప ఆధిక్యంలో ఉండగా, బీజేపీ రెబల్ అభ్యర్థి సావిత్రి జిందాల్ గట్టి పోటీ ఇస్తున్నారు.
జమ్మూ కశ్మీర్‌లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి దూసుకెళ్తోంది
జమ్మూ కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) – కాంగ్రెస్ కూటమి విజయం దిశగా సాగుతోంది. ఎన్సీ 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, మొత్తం 49 స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉంది. ఈ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ మార్క్‌ను దాటింది. మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ వెనుకబడ్డారు. పీడీపీ పార్టీ మాత్రం కేవలం 5 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.
జమ్మూ కశ్మీర్‌లో 1999 తర్వాత పీడీపీ చవిచూస్తున్న అత్యంత దారుణమైన పరాజయం ఇది. ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా తన రెండు నియోజకవర్గాల్లోనూ ఆధిక్యంలో ఉండగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రైనా నౌషిరాలో ముందంజలో ఉన్నారు.
ఎగ్జిట్ పోల్స్‌లకు విరుద్ధమైన ఫలితాలు
హరియాణా ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్‌లు పూర్తిగా తారుమారైనట్లు కనిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ స్పష్టమైన విజయం సాధిస్తుందని ఊహించినప్పటికీ, ఫలితాలు మాత్రం వేరే దిశగా సాగుతున్నాయి. ఇప్పుడు బీజేపీ 48 స్థానాల్లో, కాంగ్రెస్ 36 స్థానాల్లో, ఐఎన్ఎల్డీ 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. హరియాణా రాజకీయాల్లో ఈ ఫలితాలు కీలకంగా మారాయి.
మొత్తం ఫలితాలపై ఆసక్తి
జమ్మూ కశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడుతుండగా, కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 90 స్థానాలకు గాను 49 చోట్ల కాంగ్రెస్-ఎన్సీ కూటమి, 27 చోట్ల బీజేపీ, 5 చోట్ల పీడీపీ, ఇతరులు 9 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. మధ్యాహ్నం 12 గంటల నాటికి ఫలితాలు పూర్తిగా తేలే అవకాశం ఉంది.