హథ్రాస్: స్త్రీలను పూజించే దేశంగా భారత్ కు పేరు. కానీ మొన్న నిర్భయ, నిన్న దిశ నేదు ఇప్పుడు హథ్రాస్ ఘటన. ఇలా చెప్పుకుంటూ పోతే కేసులు అనేకం. చిన్న పిల్లల్ని, పండు ముసలివారినీ వదలని వైనం.
కొత్తగా దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న హథ్రాస్ ఘటన, హథ్రాస్ దళిత యువతిపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో బాధితురాలి కుటుంబ సభ్యులు, ఇప్పుడు ఊరు విడిచి వెళ్ళే దయనీయమైన పరిస్థితి ఏర్పడింది. తమ బిడ్డకి ఈ దారుణం జరిగిన తరువాత తాము భయంగుప్పిట్లో బతుకుతున్నామని, ఊరు విడిచి వెళ్ళిపోవడం తప్ప మరో గత్యంతరం లేదని బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
ఈ సంఘటన జరిగిన తరువాత తమ కుటుంబానికి సాయం చేసేందుకు గ్రామంలోని ఏ ఒక్కరూ ముందుకు రాలేదని బాధితురాలి తండ్రి, సోదరుడు మీడియా తో గోదు తెలుపుకున్నారు. తమ కుటుంబాన్ని గ్రామస్తులు పదే పదే నిందిస్తున్నారని, అందుకే భోల్‌గరీ గ్రామాన్ని వీడి వెళ్ళిపోనున్నట్టు వారు వెల్లడించారు.
ఈ ఘటన తరువాత నుండి గత కొద్ది రోజులుగా తాము భయంతో బతుకుతున్నామని, ఇక ఇక్కడ బతికేందుకు అవకాశమేలేదని, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి, ఎవరైనా తమ బంధువుల ఇంట్లో తలదాచుకోవాలని భావిస్తున్నట్టు బాధితురాలి తండ్రి తెలిపారు. పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని అందుకే గ్రామం వీడి పోవాలనుకుంటున్నట్టు బాధితురాలి కుటుంబసభ్యులు చెప్పారు. గ్రామంలోని ఎవ్వరూ తమ కుటుంబాన్ని పట్టించుకోలేదని ఆమె సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు.