హైదరాబాద్ : హైదరాబాద్ లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నగరం అల్లాడుతోంది. నాలాలు ఉధృతంగా పొంగిపొర్లుతున్నాయి. పలు కాలనీలు ఇప్పటికీ జల దిగ్భంధంలోనే చిక్కుకుపోయి ఉన్నాయి. వరద ఉదృతికి కార్లు సహా పలు భారీ వాహనాలు కూడా కొట్టుకుపోతున్నాయి.
సికింద్రాబాద్‌లో ఓ అపార్ట్‌మెంట్ కింద పార్క్ చేసిన కారుపైకి వరద ప్రవాహాం వల్ల మరో కారు వచ్చి చేరింది. ఇంకో వైపు నుంచి మూడవ కారు కూడా వచ్చి వాటిని ఢీకొట్టిన దృశ్యాలు వరద భీభత్సానికి అద్దం పడుతున్నాయి. భారీ వాహనాలు సైతం నీళ్లలో తేలుతూ కొట్టుకుపోతున్నాయి. కారులో డ్రైవర్ లేకున్నా అత్యంత వేగంగా వాహనాలు కదులుతూ కనిపిస్తుండటంతో ప్రజలు భయందోళనకు గురవుతున్నారు.
పలు అపార్‌మెంట్ సెల్లార్‌లోకి సైతం భారీగా వరద నీరు రావడంతో వాహనాలన్నీ కొట్టుకుపోతున్నాయి. ఎడతెరపి లేని వర్షాల కారణంగా రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరడంతో జన జీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లను వరద నీరు ముంచెత్తుతోది. గత 24 గంటల్లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 20 సెం.మీకు పైగానే వర్షపాతం నమోదయ్యింది.
ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రైవేటు సంస్థలకు అక్టోబర్ 14,15న రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. సహాయక చర్యల నిమిత్తం ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సైతం రంగంలోకి దించింది. పురాతన ఇళ్లల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. అత్యవసం అయితేనే ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావాలని, లేకుంటే ఇళ్ళలోంచి బయటకు రావొద్దని అధికారులు తెలిపారు.