హైదరాబాద్: నగరంలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇందుకు సంబంధించి ఎల్లో అలెర్ట్ జారీచేసింది. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి, దీనితో నగరంలో కొన్ని ప్రాంతాల్లో సాధారణ జీవనం ప్రభావితమైంది.
నిన్న హైదరాబాద్ సహా కామారెడ్డి, నిర్మల్, సిద్దిపేట, నాగర్‌కర్నూల్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కామారెడ్డిలో అత్యధికంగా 97.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, అలాగే హైదరాబాద్‌లోని పాటిగడ్డలో 40 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
నేడు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (IMD) సూచించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని, రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
క్రమంగా వర్షపాతం పెరుగుతుండడంతో హైదరాబాద్‌కు తాగునీటిని అందించే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నీటి మట్టాలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీనితో నగరంలో నీటి సరఫరా సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు.