ఉత్తరాంధ్ర: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు వాయుగుండం తీరం దాటనున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో వర్షాలు మరింత ఉధృతంగా కొనసాగుతున్నాయి.
ఈ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వరదలు ఉప్పొంగిపోతుండగా, జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అల్లూరి జిల్లా చింతపల్లి – నర్సీపట్నం ప్రధాన రహదారిలో రాకపోకలు నిలిచిపోగా, రెండు రోజుల వర్షాలకు పలు చోట్ల కాజ్‌వేలు కొట్టుకుపోయాయి. మడిగుంట, రాజుపాకలు గ్రామాల వద్ద వరదల ఉధృతికి కాజ్‌వేలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
వాగులు, వంకలు ఉధృతం – రాకపోకలు స్తంభించాయి
అల్లూరి జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తూ ప్రజల రాకపోకలను స్తంభింపజేశాయి. ముఖ్యంగా చింతపల్లి – నర్సీపట్నం మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రింతాడ గ్రామం వద్ద మరొక కాజ్‌వే కూడా పూర్తిగా కొట్టుకుపోవడంతో సీలేరు – చింతపల్లి మార్గంలోనూ రాకపోకలు నిలిచిపోయాయి.
కొండచరియలు విరిగిపడిన ఆదివాసీల గృహాలు
ఏజెన్సీ ప్రాంతంలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ఆదివాసీల గృహాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలు ఇళ్లు ధ్వంసమవగా, ఒక బాలిక వరదలో గల్లంతు కాగా, నలుగురు గిరిజనులు గాయపడ్డారు. గూడెం కొత్తవీధి మండలం గాలికొండ పంచాయితీ చట్రపల్లి గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న నలుగురిని అధికారులు రక్షించారు. సీలేరు ఎస్‌ఐ ఆధ్వర్యంలో జేసీబీతో ఘటనాస్థలికి సహాయక బృందం చేరుకుంది.
డొంకరాయి జలాశయానికి వరద – విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది
అల్లూరి జిల్లాలోని సీలేరు కాంప్లెక్స్‌లో ఉన్న డొంకరాయి జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి భారీ వరద వస్తోంది. సోమవారం తెల్లవారుజాము నుంచి లక్ష 10 వేల క్యూసెక్కుల నీటిని జలాశయం నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు.
జలకళ సంతరించుకున్న జలాశయాలు – అప్రమత్తంగా యంత్రాంగం
భారీ వర్షాల నేపథ్యంలో పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో జలాశయాలు నిండుకుండలుగా మారాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. నిన్న ఒక్కరోజే విజయనగరం జిల్లాలో 10 సెంటీమీటర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 2.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అంతర్రాష్ట్ర రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి
విపత్కర పరిస్థితులు కొనసాగుతుండడంతో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్ని కలిపే అంతర్రాష్ట్ర రహదారుల్లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. సీలేరు-ధారకొండ మధ్య 12 చోట్ల కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 16 కి.మీ మేర పలు చోట్ల విరిగిపడటంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
రంపచోడవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, అడ్డతీగల, దేవీపట్నం, రామవరం మండలాల్లో భారీ వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.