టెక్సాస్: అమెరికాలో ఉన్న ఆరు దక్షిణాది రాష్ట్రాలను మంచు భారీగా ముంచేస్తోంది. ఇక్కడా భారీగా కురుస్తున్న మంచుతో జనజీవనం చాలా అస్తవ్యస్తం అయింది. విమానాలను కూడా రద్దు చేశారు. ప్రజలు తమ ఇళ్లలో నుంచి బయటకు రావడానికి కూడా వీల్లేనంతగా రహదారులన్నీ మంచుతో కప్పబడ్డాయి.
ఈ మంచు వల్ల దాదాపుగా 15 కోట్ల మంది అమెరికన్లు ముప్పులో ఉన్నట్టుగా ది నేషనల్ వెదర్ సర్వీసెస్ హెచ్చరించింది. టెక్సాస్ చుట్టుపక్కల రాష్ట్రాల్లో 40 లక్షల మందికిపైగా అమెరికన్లు నీళ్లు, కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టెక్సాస్, అలబామా, ఒరెగాన్, ఒక్లహోమా, కాన్సస్, కెంటకీ, మిసిసిపీ రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి విధించారు.
టెక్సాస్‌లో అయితే పరిస్థితి మరీ ఘోరంగా ఉందని తెలుస్తోంది. ఇక్కడి విద్యుత్ ప్లాంట్లు సరిగా పని చేయడం లేదు. పైపుల్లో కూడా నీరు గడ్డ కట్టుకపోవడంతో ప్రజలు నీళ్లు కూడా లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ ఇప్పటికే నేషనల్ గార్డ్ యొక్క సాయం కోరారు. కన్సాస్ గవర్నర్ కరెంట్ పొదుపుగా వాడుకోవాలని ముందు జాగ్రత్తగా పౌరులకు విజ్ఞప్తి చేశారు.
ఇక కెంటకీలో మరింత బలంగా చలి గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు ముందు జాగ్రత్త చర్యలన్నీ పాటించాలని గవర్నర్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటికీ 27 లక్షల మందికిపైగా ప్రజలు చీకట్లోనే మగ్గిపోతున్నారు. లూసియానా, డల్లాస్ రాష్ట్రాల్లోనూ మంచు బీభత్సం నెలకొంది. ఆర్కిటిక్ నుంచి వీస్తున్న బలమైన చలిగాలుల కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి.