ఢిల్లీ: సోషల్ మీడియా వేదికగా డీప్‌ఫేక్ వీడియోల పెచ్చరిల్లుతున్న దుర్వినియోగంపై ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని లోక్‌సభలో గళం విప్పారు. డీప్‌ఫేక్ టెక్నాలజీని కేవలం వినోదం కోసమే కాకుండా, కొందరు సెలబ్రిటీలను లక్ష్యంగా తీసుకుని తప్పుడు రూపాల్లో చూపించడం, వారి ప్రతిష్ఠను దెబ్బతీయడమంటే మామూలు విషయం కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
“ఇది కేవలం కెరీర్ పరమైన సమస్య మాత్రమే కాదు. మానసిక ఆరోగ్యంపై కూడా దీని ప్రభావం తీవ్రంగా పడుతోంది,” అని హేమమాలిని తెలిపారు. కృత్రిమ మేధస్సు, డీప్‌ఫేక్ టెక్నాలజీ వృద్ధి చెందుతున్న సమయంలో, దాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు.
ఆమె స్పష్టంగా చెప్పిన అంశాల్లో ఒకటి, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అసత్య ప్రచారం జరిపేలా కొందరు డీప్‌ఫేక్ వీడియోలను ఉద్దేశపూర్వకంగా రూపొందిస్తున్నారన్నది. ఈ దుశ్చర్యను తక్షణమే నియంత్రించకపోతే, సామాజిక స్థాయిలో దీని ప్రభావం మరింత ఘోరంగా ఉంటుందని ఆమె హెచ్చరించారు.
ప్రభుత్వం ఈ విషయంలో గట్టిగా జోక్యం చేసుకోవాలని, డీప్‌ఫేక్‌ను సమర్థవంతంగా అరికట్టేందుకు ప్రత్యేక నిబంధనలు తీసుకురావాలని హేమమాలిని లోక్‌సభ వేదికగా కోరారు.