తెలంగాణ: సంధ్య థియేటర్ ఘటనలో పుష్ప-2 నిర్మాతలకు హైకోర్టు ఊరట
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి పుష్ప-2 నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, యెర్నేని నవీన్‌లకు హైకోర్టు ఊరట కల్పించింది. ఈ కేసులో వారిని అరెస్ట్ చేయరాదని, దర్యాప్తు కొనసాగించవచ్చని పోలీసులకు న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందడంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిని కొట్టివేయాలని కోరుతూ రవిశంకర్, నవీన్‌లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ కె.సుజన మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి, పిటిషనర్లకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్.నవీన్‌కుమార్ వాదనలు వినిపిస్తూ, ఈ ఘటనకు పిటిషనర్లకు ఎలాంటి సంబంధంలేదని న్యాయమూర్తికి తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అభియోగాలు వారికి వర్తించవని వివరించారు.
హీరో అల్లు అర్జున్ థియేటర్‌కి వస్తున్నారని సమాచారం ఇచ్చిన నిర్మాతల కార్యాలయ సిబ్బందిని న్యాయవాది ప్రస్తావించారు. ఈ సమాచారం మేరకు సీనియర్ పోలీస్ అధికారులు అయిన ఏసీపీ, డీసీపీలు ఆ రోజు థియేటర్‌కు చేరుకుని భద్రతా ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలిపారు.
వాదనలు విచారణ చేసిన జస్టిస్ కె.సుజన, పిటిషనర్లను అరెస్ట్ చేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే, దర్యాప్తునకు పూర్ణంగా సహకరించాల్సిందిగా పిటిషనర్లను ఆదేశించారు. అలాగే, కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు, ఫిర్యాదుదారుకు నోటీసులు జారీచేశారు.
ఇకపోతే, ఈ కేసులో అరెస్టయిన థియేటర్ మేనేజర్ అడ్ల శరత్‌చంద్రనాయుడు, అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది చెరుకు రమేశ్, శ్రీరాములు రాజులకు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను న్యాయమూర్తి ఈ నెల 6కి వాయిదా వేశారు.