జాతీయం: కేజ్రీవాల్ నివాసంపై హైకోర్టు నోటీసులు
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి ప్రభుత్వ వసతి కేటాయించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌లో కేజ్రీవాల్‌కు ఢిల్లీలో సొంత నివాసం లేకపోవడంతో ప్రభుత్వ నివాసం కేటాయించాలని ఆప్ వాదించింది. హైకోర్టు ఈ అంశంపై నవంబర్ 26న విచారణ చేపట్టనుంది. కేజ్రీవాల్ సెప్టెంబర్ 17న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా, అక్టోబర్ 4న తన అధికార నివాసం ఖాళీ చేశారు. ప్రస్తుతం ఆయన ఫిరోజ్‌షా రోడ్‌లోని 5వ నంబర్ బంగ్లాలో తాత్కాలికంగా నివసిస్తున్నారు, కానీ ఈ నివాసం పంజాబ్‌కు చెందిన ఆప్ ఎంపీ అశోక్ మిట్టల్‌కు కేటాయించబడింది.
ఆప్ వాదన: కేజ్రీవాల్‌కి వసతి అవసరం
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకారం, కేజ్రీవాల్‌కి ఢిల్లీలో సొంత నివాసం లేకపోవడంతో ప్రభుత్వ వసతి ఇచ్చేందుకు అర్హత కలిగి ఉన్నారు. జాతీయ పార్టీగా ఉన్న ఆప్ తన జాతీయ కన్వీనర్‌కూ ఇతర జాతీయ పార్టీల నాయకులకు లభించే వసతులు కల్పించాలన్న అభ్యర్థనతో ఈ పిటిషన్ దాఖలు చేసింది.
బీజేపీపై తీవ్ర విమర్శలు
ఈ పరిణామాల నడుమ వికాస్‌పురి ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న కేజ్రీవాల్‌పై దాడి జరగడం ఆప్ వర్గాల్లో సంచలనం రేపింది. ఈ దాడి వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. రాజకీయ కక్షతో బీజేపీ తన నేతపై దాడికి పాల్పడిందని ఆప్ నేతలు ఆరోపణలు చేశారు. ఈ ఘటన రాజకీయంగా మరింత వేడిని రేపే అవకాశం ఉంది.