హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితుల పై ఆ రాష్ట్ర హైకోర్టు విచారణను చేపట్టింది. ప్రజలకు కోవిడ్ లక్షణాలు ఉంటే వాటి ఆధారంగా చేసుకుని ఆస్పత్రులలో అడ్మిట్ చేసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ లేకపోయినప్పటికీ ప్రతి హాస్పిటల్ పేషెంట్లకు అడ్మిషన్ ఇవ్వాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. 24 గంటల్లోగా ఆర్‌టీపీసీఆర్ రిపోర్టు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని కోరింది.
ఈ విచారణ నేపథ్యంలో రోజుకు 30 నుంచి 40 వేల ఆర్‌టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. ఈ క్రమంలో కోర్టు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 3,47,000 టెస్టులు మాత్రమే చేశారు, కానీ ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇప్పటి వరకు 8,40,000 టెస్టులు చేసి ఉండాలి. కానీ అలా ఎందుకు చేయడం లేదు? అని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రతి రోజు కరోనా కేసుల వివరాలను మీడియా బులెటిన్ ఖచ్చితంగా విడుదల చేయాలని ఆదేశించింది.
రాష్ట్రంలోని జిల్లాలు యాదాద్రి భువనగిరి, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి ఏరియాలో అధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. కాబట్టి ఈ ప్రాంతాల్లో రోజువారి టెస్టుల సంఖ్య పెరగాలి. వలస కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్తున్నారు. వారు ఇబ్బందులు పడకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కోవిడ్ నియంత్రణ చేయడానికి ప్రత్యేక కమిటీ వేయాలి. నైట్ కర్ఫ్యూ విధించడం కాదు, పగటి వేళ కూడా ప్రజలను బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా చూడాలని’’ కోర్టు సూచించింది.
ఇంకా రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకుండా ఆంక్షలు విధించాలని కోర్టు సూచించింది. వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, సినిమా థియేటర్లలపై పటిష్ట చర్యలు తీసుకోవాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివాహాది వేడుకలు, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ జనాలు ఉండకుండా చూడాలని కోర్టు సూచించింది. మున్సిపల్ ఎన్నిక సమయంలో భౌతిక దూరం పాటించేలా చూడాలి, ర్యాలీలలో జనాభా అధికంగా ఉండకుండా చూడాలని తెలిపింది.
రాష్ట్రంలో రోగులకు కావాల్సిన ఆక్సిజన్ కొరత ఉందని ప్రభుత్వం చెపుతోంది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చూడాలి. రాష్ట్ర వ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్స్, మైక్రో కంటైన్మెంట్ జోన్ల వివరాలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలు, పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు ఈనెల 27కు వాయిదా వేసింది.