అమరావతి: ఈ ఏడాది రాష్ట్రంలో వేసవి అధిక వేడిని ప్రసరింప చేయనుంది. ఈ పాటికే ఈ ఏడాది సూర్యుడి వేడి చూపిస్తుండగా ఇక పోనుపోను ఎండల తీవ్రత పెరగనుంది. అలాగే ఈ సారి తీవ్ర వడగాడ్పులకు కూడా అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ విషయాన్ని భారత వాతావరణ విభాగం (ఐఎండీ), వాతావరణ నిపుణులు తెలియ జేస్తున్నారు. ఇందుకు కారణం మారిన వాతావరణ పరిస్థితులే అని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఏప్రిల్ నుంచి వేసవి సెగలు మొదలవుతాయి. కానీ ఈసారి మార్చి ఆరంభం నుంచే ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఇక ఫిబ్రవరి ఆఖరు నుంచే రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో నమోదవుతూ వచ్చాయి.
ఈ ఎండలు పోనుపోను మరింత ఉధృతం అవనున్నాయి. మార్చి నుంచి మే వరకు కొంకణ్, గోవాలతో పాటు కోస్తాంధ్రలో వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తన తాజా నివేదికలో పేర్కొంది. కోస్తాంధ్రలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా అంచనా కట్టింది. పొరుగున ఉన్న చత్తీస్‌గఢ్, ఒడిశాలో ఉష్ణతాపం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో దాని ప్రభావం కోస్తాంధ్రలోనూ అధికంగా ఉండనుంది.
ప్రతి ఏటా మన ఉత్తర భారత దేశంలో మార్చి ఆఖరి వరకు పశ్చిమ ఆటంకాలు (వెస్టర్న్ డిస్టర్బెన్స్) చురుగ్గా ఉంటూ ప్రభావం చూపుతూ ఉంటాయి. దీని వల్ల ఆకాశంలో మేఘాలు ఏర్పడి వేడి తీవ్రతను తగ్గిస్తాయి. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వాటి చురుకుదనం తగ్గింది. తద్వారా ఆకాశంలో మేఘాలేర్పడకుండా నిర్మలంగా ఉండడం ఉష్ణోగ్రతలు పెరగడానికి మరింత దోహదపడుతోంది.
ఇప్పటికే రాష్ట్రంలో వేసవి తాపం కనిపిస్తోంది. సాధారణం కంటే 2 నుంచి 3.5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం తునిలో 38 (+3.5), నందిగామ 37 (+1), మచిలీపట్నం 34.4 (+2), కాకినాడ 34 (+1.2), నర్సాపురం 33.6 (+1.3) కళింగపట్నం 33 (+1.4), బాపట్ల (+1), విశాఖపట్నం 32.3 (+2) డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.